- విద్యార్థులకు పోలీసుల విజ్ఞప్తి..
- కేంద్రమంత్రి రాజీనామా చేసిన అనంతరం పరిణామం..
సీజేపీ, విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులు, సీజేపీ నేతలకు స్థానిక పోలీసులు కీలక సూచన చేశారు. జంతర్‌మంతర్‌ను వదిలి వెళ్లాల్సిందిగా సూచించారు. దీనిపై లౌడ్స్పీకర్లలో సూచన చేశారు. సీజేపీ నేతలు, విద్యార్థులు, నిరసనకారుల డిమాండ్లు నెరవేరిన నేపథ్యంలో ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు.
నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ సీజేపీ ఆధ్వర్యంలో నెల రోజులకుపైగా జంతర్‌మంతర్ వద్ద ఆందోళన జరిగింది. చాలారోజులపాటు సాగిన నిరసనల వల్ల స్థానికంగా చాలా సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా స్థానిక వ్యాపారాలకు ఇబ్బంది కలిగింది.
నిత్యం రద్దీగా ఉండే ఇక్కడి మార్కెట్లు ఆందోళనకారుల రాకపోకలతో, నిరసనలతో డౌన్ అయ్యాయి. అలాగే, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తాయి. చాలా చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ చేపట్టాల్సి వచ్చింది. ముందుజాగ్రత్త చర్యగా సమీపంలోని మెట్రో స్టేషన్లను మూసివేశారు. జంతర్‌మంతర్ సమీపంలోని వీధి మార్కెట్లు, కన్నౌట్ ప్లేస్‌లోని మార్కెట్లలో కొద్ది రోజులుగా అతితక్కువ వ్యాపారం జరిగిందని వ్యాపారులు తెలిపారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి, శాంతి భద్రతల పర్యవేక్షణకు భారీ స్తాయిలో సీనియర్లు, ఇతర అధికారులను కూడా అక్కడ నియమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు జంతర్‌మంతర్‌ను ఖాళీ చేస్తే ఇవన్నీ సాధారణస్థాయికి చేరుకుంటాయి. అందుకే త్వరగా అక్కడినుంచి అందరినీ ఖాళీ చేయించాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికోసమే విద్యార్థులు, సీజేపీ నేతలకు సూచనలు చేశారు.
