నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో తరచుగా దొంగ తనాలకు పాల్పడుతున్న 16ఏళ్ల బాల నెరస్తుడికి 2ఏళ్ల శిక్ష విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పును వెల్లడించిందని లాలాగూడ ఇన్ స్పెక్టర్ బీ రవికిరణ్ తెలిపారు. ఇటీవల లాలగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే అధికారుల ఇళ్లలో జరిగిన దొంగతనాలపై వారు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని ఎస్ఐలు జీ అమర్ సింగ్, పీ ఛత్రపతి విలియమ్స్ విజయ్ ఆధ్వర్యంలో సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని సీసీ కెమెరాలలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఇతడు ఇప్పటి వరకు లాలగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, సనత్నగర్ ఠాన పరిధిలో రెండు, చెర్లపల్లి, ఓయూ పీ ఎస్ ల పరిధిలో ఒక్కో కేసులో నిందితుడిగా తమ విచారణలో తేలిందని, అన్ని ఆధారాలతో నాంపల్లి V అదనపు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అన్ని ఆధారాలను పరిశీలించిన జ్యుడిషయల్ మేజిస్ట్రేట్ వీ సౌమ్య బాలుడికి 2ఏళ్ల జైల్ శిక్ష విధించారని, వారి ఆదేశాల మేరకు బాలుడ్ని గాజుల రామారంలోని ప్రభుత్వ బాలుర ప్రత్యేక గృహానికి తరలించినట్లు వెల్లడించారు.
ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా శిక్షపడే విదంగా ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులతో పాటు సీడీఓ కానిస్టేబుల్ సీ ప్రవీణ్, ప్రాసిక్యూషన్ తరపున సమర్థవంతంగా వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీలతను పోలీస్ ఉన్నతిధికారులు అభినందించారు.
