- ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం..
- హెచ్చరించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని కూడా అనుమతించబోమని, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శుక్రవారం హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడ్డ విద్య వ్యవస్థలో ఉపాధ్యాయుల బాధ్యత అత్యంత కీలకం కావడంతో విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తప్పదని ఆయన పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి హాజరు నమోదు, తరగతుల నిర్వహణ, బోధన పద్ధతులు, పుస్తకాల వినియోగం, విద్యార్థుల అభ్యాస స్థాయి మరియు పాఠశాల నిర్వహణలను స్వయంగా పరిశీలించారు. మొత్తం ఐదుగురు ఉపాధ్యాయుల్లో ఒకేసారి ముగ్గురు ఉపాధ్యాయులు విధులకు రాని సంఘటన కలెక్టర్‌కు అవగాహన వచ్చింది. ప్రధాన ఉపాధ్యాయుడు శంకర్‌తో పాటు లావణ్య, మానస హాజరుకాలేదని గుర్తించారు.
పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయులైన సరస్వతి, రజితల నుంచి ప్రస్తుత హాజరు శాతం, తరగతుల నిర్వహణ, సబ్జెక్టుల బోధన, విద్యార్థుల అభ్యాస స్థాయి, మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి అంశాలపై వివరణ తీసుకున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 94 మంది విద్యార్థులు హాజరు ఉన్న సందర్భంలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులతో అన్ని తరగతులు నిర్వహించడం ఎలా జరుగుతుందనీ కలెక్టర్ ప్రశ్నించారు, దీనివల్ల విద్యార్థుల అభ్యాసం తగ్గి నాణ్యమైన విద్య అందకపోవడంతో అది చింతాకరమని అన్నారు.
కలెక్టర్ పాఠశాల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)తో మాట్లాడి, నిర్లక్ష్యంపై శంకర్, లావణ్య, మానసపై వెంటనే సస్పెన్షన్ సూచిస్తూ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలను విస్మరించకుండా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు మరింత నిబద్ధతతో విధులు నిర్వహించాలని, ప్రతి విద్యార్థికి సమర్థవంతమైన బోధన అందించటం ప్రతి ఉపాధ్యాయ ధర్మమని సూచించారు. పాఠశాల సందర్శనా సమయంలో కల్వకుర్తి తహసిల్దార్ ఇబ్రహీం, మున్సిపాలిటీ చైర్మన్ బృంగి ఆనంద్ కుమార్ రత్నమాల, మున్సిపాలిటీ కమిషనర్ షేక్ మహమూద్,తదితర అధికారులు పాల్గొన్నారు.
