- ఇన్సూరెన్స్ పేరుతో వైట్ కాలర్ మోసానికి గురౌతారు..
- బజాజ్ ఫైనాన్స్ పేరిట కోట్లలో టోకరా వేసిన ముఠా..
- దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్..
- పోలీసులకు ఫిర్యాదు చేయనున్న బాధితులు..
- ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన చేయని బజాజ్ ఫైనాన్స్..
ప్రతి మనిషిలోనూ తన సొంత కాళ్ళమీద నిలబడాలనే ఆశ ఉంటుంది.. కానీ దానికి తగిన ఆర్ధిక వనరులు వుండవు.. సహాయం చేసేవాళ్ళు వుండరు.. పోనీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఫైనాన్స్ తీసుకుందామంటే భయం.. అందుకే బ్యాంక్స్‌ని ఆశ్రయిస్తారు.. అక్కడ సవాలక్ష ఆంక్షలు ఎదురవుతాయి.. ఈ క్రమంలో బజాజ్ ఫైనాన్స్ లాంటి నమ్మకమైన సంస్థల పేరుతో లోన్స్ ఇప్పిస్తామని ఎవరైనా నమ్మబలికితే మరో మాట లేకుండా.. మరో ఆలోచనకు తావివ్వకుండా వెంటనే ఒకే చెప్పేస్తాం.. ఆతరువాత మొదలవుతుంది అసలైన ఆట.. ఇన్సూరెన్స్‌ల పేరుతో ఆశావహుల్ని నిలువునా మోసం చేస్తారు.. అలాంటి సంఘటనే ఇది.. ఆ వివరాలు మీ కోసం..
లోన్ ఇప్పిస్తామంటూ నమ్మించి, బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి కోట్లాది రూపాయల మోసానికి పాల్పడుతున్న ఒక ముఠాపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నిరుద్యోగులు, వ్యాపారస్తులు, అత్యవసరంగా డబ్బు అవసరమైన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు అధికారులను ఆశ్రయించారు.
టాప్ కంపెనీల పేరిట ఫోన్ కాల్స్ :
నిందితులు ప్రముఖ ఆర్థిక సంస్థ ‘బజాజ్ ఫైనాన్స’ లేదా దానికి అనుబంధ సంస్థల ప్రతినిధులమంటూ నమ్మ బలుకుతూ కస్టమర్లకు ఫోన్లు చేస్తారు. నకిలీ గుర్తింపులతో నమ్మకం కలిగించి, ఏకంగా రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో లోన్లు ఇప్పిస్తామని భారీ ఆశలు రేపుతారు. లోన్ మంజూరు కావాలంటే, తాము చెప్పిన కంపెనీల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం తప్పనిసరి అని కస్టమర్లను నిబంధనల పేరుతో ఒప్పిస్తారు. బాధితులు నమ్మి ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని చెల్లించిన తర్వాత, అసలు కథ మొదలవుతుంది.
ఆ తర్వాత లోన్ పైకాన్ని మాత్రం విడుదల చేయకుండా.. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ మోసగిస్తారు. మోసపోయామని గ్రహించిన బాధితులు నిలదీస్తే.. “మీకు ఇన్సూరెన్స్ పాలసీలు లీగల్‌గానే వచ్చాయి కదా, వీటికి లోన్‌కు సంబంధం లేదు” అంటూ ఎదురు సమాధానాలు ఇస్తూ, తాము చట్టబద్ధంగానే ఉన్నామని బుకా యించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మోసానికి సంబంధించి నింది తుల ఫోన్ నంబర్లు, వాట్సాప్ చాటింగ్‌లు, ఈమెయిళ్ళు, పాలసీ పత్రాలు, నగదు చెల్లింపు రశీదులు, కాల్ రికార్డింగ్‌లతో కూడిన పక్కా ఆధారాలను బాధితుడు దర్యాప్తు అధికారులకు సమర్పిం చారు. అయితే ఈ సంచలన ఆరోపణలపై బజాజ్ ఫైనాన్స్ సంస్థ గానీ, లేదా సంబంధిత అధికారిక వర్గాలు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు..
