Friday, July 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంAdibatla | పర్మిషన్ ఒకటి.. నిర్మాణం మరొకటి..

Adibatla | పర్మిషన్ ఒకటి.. నిర్మాణం మరొకటి..

  • ఆదిభట్లలో అంతులేని అక్రమ నిర్మాణాలు..
  • జీహెచఎంసీ శంషాబాద్ జోన్ ఆదిభట్ల సర్కిల్-15 అధికారుల నిర్లక్ష్యం..
  • సరైన సెట్ బ్యాక్‌లు లేవు.. భద్రతకు తిలోదకాలు..
  • ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు శూన్యం..
  • ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి..

నువ్వు ఎలాంటి నిర్మాణానికైనా పరిమిషన్ తీసుకో.. అవినీతి అధికారులకు కాసులు పంచు.. నీకు నచ్చినన్ని అంతస్తులు కట్టుకో.. నియమాలు, నిబంధనలు అసలు అవసరం లేదు.. ఎవరినీ కేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు.. పైసల్ ఇచ్చుకో అక్రమంగా నిర్మాణాలు చేసుకో.. ప్రస్తుతం జీ.హెచ్.ఎం.సి.లో ఇదే నడుస్తోంది.. తాజాగా ఆదిభట్లలో వెలుగు చూసిన ఒక అక్రమ నిర్మాణం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.. ఆ వివరాలు మీకోసం..

“పర్మిషన్ ఒకటి… నిర్మాణం మరొకటి… అధికారులు చూస్తూ ఊరుకుంటే నిబంధనలు ఎక్కడ?” అంటూ ఆదిభట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల ప్లాట్ నెం. 210, సర్వే నెం. 73/AA/1, 74/AA/1, 75/AA/1, 76/UU, 73/Ε, 76/ΕΕ/Α, 74/E, 75/E, 75/A, 73/ΕΕ, 74/ΕΕ, 75/EE, 77/A, 76/U లో జరుగుతున్న నిర్మాణం తీవ్ర వివాదానికి దారితీసింది. మంజూరైన భవన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ ఆదిభట్ల సర్కిల్-15 అధికారుల పనితీరుపై పలు అనుమానాలు లేవనెత్తుతున్నారు.

- Advertisement -

స్థానికుల ఆరోపణల ప్రకారం, సంబంధిత భవనానికి స్టిల్ట్ ప్లస్ 2 అంతస్తులు మాత్రమే అనుమతి లభించినప్పటికీ, ప్రస్తుతం గ్రౌండ్ ప్లస్ 42 అంతస్తులు, అదనంగా పెంట్ హౌస్లు నిర్మిస్తున్నారు.. అంతే కాకుండా భవన నిబంధనల ప్రకారం తప్పని సరిగా ఉండాల్సిన సెట్బ్యక్లు కూడా పాటించలేదని ఆరోపిస్తున్నారు.

సెట్‌బ్యాక్‌లు లేకపోతే… భద్రత ఎక్కడ?

స్థానికుల మాటల్లో అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ ఎలా వస్తుంది…? అంబులెన్స్‌కు దారి లేకపోతే బాధ్యత ఎవరిది…?నిబంధనలు ప్రజల కోసమా… లేక ఉల్లంఘించడానికా…? అదనపు అంతస్తుల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సవరించిన భవన అనుమతులు తీసుకోలేదని కూడా వారు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదులు చేస్తున్నాం… చర్యలు ఎక్కడ?

స్థానికుల కథనం ప్రకారం, పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, నిర్మాణం యథావిధిగా కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లముందే నిర్మాణం సాగుతోంది… ఫిర్యాదులు చేస్తున్నాం.. కానీ చర్యలు మాత్రం కనిపించడం లేదు..అని పలువురు స్థానికులు వాపోతున్నారు.

వెంటనే జీహెచఎంసీ అధికారులు స్థలాన్ని తనిఖీ చేసి, నిర్మాణం మంజూరైన ప్లాన్‌కు అనుగుణంగా ఉందో లేదో పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణపై విమర్శలు :

ఈ ఘటనతో ఆదిభట్ల సర్కిల్-15లో ప్రభుత్వ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవన నిబంధనలను ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలని, ఉన్నతాధికారులు స్థానిక అధికారుల పనితీరును సమీక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

పట్టణాభివృద్ధి నిపుణుల అభిప్రాయం ప్రకారం, అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్‌బ్యాక్‌ల ఉల్లంఘన వల్ల భవిష్యత్తులో భద్రతా సమస్యలు, మౌలిక వసతులపై ఒత్తిడి, పరిసర భవనాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. “అనుమతి గీత దాటితే… ప్రమాదం మొదలవుతుంది… నిబంధనలకు విలువ లేకపోతే… నగర భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది…చట్టం అందరికీ ఒకటే అయితే… అమలు కూడా అందరికీ ఒకేలా ఉండాలి…”

ప్రజల డిమాండ్ :

జీహెచఎంసీ కమిషనర్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులను వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆదిభట్ల ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మరిన్ని ఆధారాలతో అధికారుల నిర్లక్ష్యం, అక్రమ నిర్మాణంపై మరో కథనాన్ని మీ ముందుకు తీసుకురానుంది

“ఆదాబ్ హైదరాబాద్”.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News