- అదే దారిలో వెండి ధరలు..
- వేగంగా దిగొస్తున్న రేట్లు..
బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతకొద్ది నెలలుగా ఆకాశమే హద్దు అన్నట్టు దూసుకుపోయిన రేట్లు.. ఇప్పుడు అంతే వేగంతో దిగొస్తున్నాయి. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గడిచిన దశాబ్దంలోనే ఎన్నడూలేనంతగా గోల్డ్ విలువ క్షీణించింది. ఇప్పటిదాకా 12 శాతం రేట్లు పడిపోయాయి. 2016 డిసెంబర్ నుంచి చూస్తే.. 3 నెలల వ్యవధిలో ఈ స్థాయిలో ధరల క్షీణత ఇదే. సిల్వర్ వాల్యూ సైతం నాలుగేండ్లలో భారీ పతనాన్ని చవిచూసింది. 17.6 శాతం తగ్గింది. 2022 జూన్ తర్వాత ఇప్పుడే ఇంతటి క్షీణత అంటున్నాయి మార్కెట్ వర్గాలు. నిజానికి వరుసగా 15 నెలలు పరుగులు పెట్టిన పుత్తడి, వెండి ధరలు..
ఒక్కసారిగా రివర్స్ గేర్లోకి వెళ్లడంతో మార్కెట్లోనూ స్తబ్ధత నెలకొన్నది. కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారు మరి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరల పతనం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి 28న ఔన్స్ గోల్డ్ ఆల్టైమ్ హై రికార్డును సృష్టిస్తూ 5,417 డాలర్లు పలికింది. సిల్వర్ తొలిసారి 117 డాలర్లుగా నమోదైంది. అయితే ఇప్పుడున్న ధరలతో పోల్చితే బంగారం 24 శాతం, వెండి దాదాపు 47 శాతం తగ్గాయి. ప్రస్తుత ట్రెండ్నుబట్టి ఇంకా తగ్గవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే భారతీయ మార్కెట్లోనూ రేట్లు మరింత దిగివస్తాయన్న అభిప్రాయాలు మార్కెట్ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి.
