- 97 డిపోలు ఉన్నా ప్రయాణికులకు పరిష్కారం కరువు..
- అటకెక్కిన డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం..
- సమస్యలు వినేవారెవరు ఎవరంటూ ప్రయాణికుల ఆవేదన ?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోలు, 364 బస్ స్టేషన్లతో ప్రజలకు సేవలు అందిస్తోంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలపై ఆధారపడుతున్నప్పటికీ అనేక డిపోల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని ప్రయాణికులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల “డయల్ యువర్ ఆర్టీసీ డీఎం” వంటి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా తగ్గిపోయిందని ప్రయాణికులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎక్కువగా ఖమ్మం, మెదక్, నారాయణఖేడ్, బాన్సువాడ, రంగారెడ్డి, ఇల్లందు ప్రాంతాలకు చెందిన డిపోల్లో పనితీరు, సౌకర్యాలు, నిర్వహణపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బస్సుల కొరత, సమయానికి సర్వీసులు నడవకపోవడం, గ్రామీణ ప్రాంతాలకు తగిన సంఖ్యలో బస్సులు లేకపోవడం, బస్ స్టేషన్లలో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల లేమి, రద్దీ సమయాల్లో బస్సుల ఏర్పాటు వంటివి ఉన్నాయి.
మరోవైపు ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్ టికెటింగ్ వ్యవస్థ కూడా కొన్ని ప్రాంతాల్లో సమస్యగా మారింది. నెట్వర్క్ సరిగా అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ జారీకి ఎక్కువ సమయం పడుతుండటంతో బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు.
మహాలక్ష్మి పథకం అమలుతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో అదనపు బస్సులు, కొత్త డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణంపై ఆర్టీసీ దృష్టి పెట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రతి డిపోలో నెలవారీ ప్రజా వినతుల కార్యక్రమాలు నిర్వహించాలని, డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని ప్రయాణ ìకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీకి మళ్లీ ప్రజల విశ్వాసం పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
