- కుంభకోణంలోనే దాదాపు 2000 ఆలయాలు..
తమిళనాడు ఆలయాలకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. అందునా ఈ రాష్ట్రంలోని ఒక్క కుంభకోణంలోనే దాదాపు 2000 ఆలయాలు వెలసి ఉన్నాయి. అందుకే తమిళనాడు యాత్రలో కుంభకోణం దర్శనం ప్రధానమైనది. సాధారణంగా శివాలయంలో కానీ వేరే ఇతర ఆలయాలలో కానీ నవగ్రహాలను ప్రతిష్టించి ఉండడాన్ని చూస్తాం. కానీ కుంభకోణం చుట్టూతా నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేక ఆలయం వెలసి ఉండడం విశేషం. ఈ కథనంలో కుంభకోణం పరిసరాల్లో వెలసిన నవగ్రహాల ఆలయాల విశేషాలు చూద్దాం.
నవగ్రహాలు తొమ్మిది. తమిళనాడులోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవాలయం వెలసి ఉంది. ఈ ఆలయాలను దర్శిస్తే చాలు గ్రహపీడలు తొలగుతాయని విశ్వాసం. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అని అంటారు. నవగ్రహ దేవాలయాల విశేషాలు చూద్దాం.
నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సూర్యనార్ కోయిల్ పేరుతో సూర్యభగవానునికి ప్రత్యేక సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయంలో సూర్య భగవానుడు ఆయన సతీమణులు అయిన ఉష, ఛాయా సమేతంగా వెలసి ఉన్నారు. ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో కాశీ విశ్వేశ్వరుడు విశాలక్ష్మీని, నవగ్రహాలచే ప్రతిష్టించిన వినాయకుని కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించడం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.
