- ఆరోపణలు చేసిన మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ..
- సంచలనంగా మారిన ఆర్ధిక అవకతవకలు..
బంగారం శుద్ధి, ఆభరణాల మార్కెట్‌లో దిగ్గజంగా పేరొందిన బెంగళూరుకు చెందిన రాజేశ్ ఎక్స్పోర్ట్స్.. భారీ కుంభకోణానికి పాల్పడిందని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆరోపిస్తున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన బడా కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ సంస్థలో ఏకంగా రూ.15.15 లక్షల కోట్ల ఆర్థిక అవకతవకలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. కాగా, సెబీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈ స్కామ్.. నిజమేనని తేలితే భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో చోటుచేసుకున్న భారీ మోసాల్లో ఇది కూడా ఒకటి అవుతుంది.
2024 మార్చిలో సెబీకి ఓ వాటాదారుడి నుంచి ఫిర్యాదు అందింది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి గత కొన్నేండ్లుగా తప్పుడు ఆదాయ ప్రకటనలు వస్తున్నాయన్నది దాని సారాంశం. ఈ క్రమంలోనే సెబీ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లను నిర్వహించింది. ఇందులో భాగంగానే బుధవారం ఇందుకు సంబంధించి 109 పేజీల మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది. అందులో 2020-21 నుంచి 2024-25 మధ్య సంస్థ ప్రకటించిన ఆర్థిక వివరాలకు, వాస్తవ గణాంకాలకు భారీగా తేడాలున్నట్టు పేర్కొన్నది. కంపెనీ చూపిన ఏకీకృత ఆదాయాల్లో 97-99 శాతం విదేశాల నుంచే వచ్చినట్టున్నది.
