- జేఈఈ అడ్వాన్సుడ్ 2026 లో 4వ ర్యాంక్..
- తెలంగాణ రాయాష్ట్ర టాపర్ గా నిలిచిన వైనం..
జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి మోహిత్ శేఖర్ శుక్లా అద్భుత ప్రతిభ కనబరిచాడు. జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించడమే కాకుండా, తెలంగాణ రాష్ట్ర టాపర్‌గా నిలిచాడు. అయితే, మోహిత్ సాధించిన విజయం కంటే, అతని తండ్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులపై ఉండే ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలపై ఈ వ్యాఖ్యలు కొత్త వాదనలకు తెరలేపాయి.
మోహిత్ తండ్రి మనీష్ శేఖర్ శుక్లా ఇస్రోలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తుండగా, అతని తల్లి కూడా గతంలో ఇస్రోలోనే పనిచేశారు. కుమారుడి విజయంపై మనీష్ స్పందిస్తూ, “మోహిత్‌కు చిన్నప్పటి నుంచి మేము మొబైల్ ఫోన్ ఇవ్వలేదు. కేవలం సమాచార సేకరణ కోసం మాత్రమే కంప్యూటర్‌లో గూగుల్ సెర్చ్ చేసేవాడు. పరీక్షలో అతను కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేశాడు, లేకపోతే మొదటి ర్యాంక్ వచ్చేది” అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జేఈఈ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించినప్పటికీ, అగ్రస్థానం రాలేదనే అసంతృప్తి తండ్రి మాటల్లో కనిపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కుటుంబం పాటించిన క్రమశిక్షణను కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది విద్యార్థులపై తల్లిదండ్రులు ఉంచే విపరీతమైన ఒత్తిడికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. “దేశంలో 4వ ర్యాంక్ సాధించిన విద్యార్థి విషయంలోనూ మొదటి ర్యాంక్ రాలేదని విచారం వ్యక్తం చేయడం సరికాదు” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
