- జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేయబడిన వరి ధాన్యం తరలింపునకు అదనపు లారీలు కేటాయించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో గల జై యోగేశ్వర రైస్ మిల్లును తహసీల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, ఈ క్రమంలో తరలించబడిన ధాన్యాన్ని లారీల నుంచి త్వరితగతిన దిగుమతి చేసి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లర్ ను ఆదేశించారు. ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేసి, లారీల నిల్వ సమయాన్ని తగ్గించాలని సూచించారు.


అనంతరం లక్షెట్టిపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో ఐకేపీ సీసీలు, పీఏసీఎస్ సీసీలు, సెక్టార్-1 సిబ్బంది, రవాణా గుత్తేదారుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేయాలని రవాణా గుత్తేదారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి ప్రక్రియలు జాప్యం కాకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి, రైతులకు సకాలంలో సేవలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది
