- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
జనగణనలో భాగమైన ఇండ్ల గణన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం దిలావర్ పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో కొనసాగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జనగణన సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ, హౌస్ లిస్టింగ్ ప్రక్రియ జనగణనలో అత్యంత కీలకమైన ఘట్టమని, దీనిని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి కేటాయించిన లక్ష్యాలు, ఇప్పటివరకు పూర్తయిన ఇండ్ల వివరాలను ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో అడిగి వాకబు చేశారు. ప్రజల నుంచి సేకరించే సమాచారం ఖచ్చితత్వంతో ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం కలెక్టర్ స్థానికులతో మాట్లాడుతూ, జనగణన దేశ అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే ప్రభుత్వాలు ప్రజాప్రయోజనార్థం వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తాయని పేర్కొన్నారు. కాబట్టి ప్రజలంతా ఎన్యుమరేటర్లు అడిగిన వివరాలను ఖచ్చితంగా అందించి, జనగణన ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ పరిశీలన లో జనగణన సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
