- జగన్ పై ఎదురుదాడికి దిగిన టీడీపీ..
- తీవ్ర విమర్శలు చేసిన రాం గోపాల్ రెడ్డి..
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హ*త్యల చుట్టూ తిరుగుతున్న విమర్శల పర్వంలో తెలుగుదేశం పార్టీ మరోసారి వైసీపీ అధినేత జగన్ పై ఎదురుదాడికి దిగింది. కడప జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి వైఎస్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల గడ్డపై నాడు వైఎస్ రాజారెడ్డి అరాచకాలు సృష్టించారని, కేవలం అధికారం, ఆధిపత్యం కోసమే హ*త్యలు, కుట్రలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైనింగ్ గనులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కోసం ఎంతోమంది అమాయకులను చంపేశారని ఆరోపించారు. వైఎస్ కుటుంబంతోనే రాష్ట్రంలో హ*త్యా రాజకీయాలు మొదలయ్యాయని, వారితోనే అవి ముగుస్తాయని రాంగోపాల్రెడ్డి హెచ్చరించారు.
వైఎస్ కుటుంబం నెత్తుటి కూడు తింటోందంటూ రాంగోపాల్రెడ్డి ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించారు. “గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేసి, ఆ అండతోనే ఎన్నో కేసుల నుంచి తప్పించుకున్నారు. ఎదురుతిరిగిన ఎవరినీ వైఎస్ కుటుంబం వదిలిపెట్టలేదు. ఇన్ని అరాచకాలు, హ*త్యలు చేసి.. ఇప్పుడు తాము స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని చెప్పుకుంటారా?” అని ఎద్దేవా చేశారు. నాడు రాజారెడ్డి బ్రిటిష్ సైన్యం కోసం పనిచేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించిన ఆయన, అప్పటి మద్రాస్ బాంబు ఘటన తర్వాత రాజారెడ్డి అక్కడి నుంచి పారిపోయి రాలేదా అని అడిగారు. బ్రిటిష్ వారి కింద పనిచేసి ఇప్పుడు దేశభక్తులమని కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు.
