Tuesday, May 19, 2026
Homeఆదిలాబాద్Ramagundam CP | ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

Ramagundam CP | ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

  • పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి,సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను రామగుండం సీపీ అంబర్ కిషోర్ జా సందర్శించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీ కి అధికారులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.అనంతరం ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది నుండి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.

తదుపరి స్టేషన్ పరిసరాలను పరిశీలించి,స్టేషన్ రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ సిబ్బంది మరియు ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలు మరియు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది సమస్యలను కూడా సీపీ అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ,పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్,వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలని సూచించారు. ప్రతి కానిస్టేబుల్‌కు కేటాయించిన కాలనీలు,గ్రామాలను సందర్శించి ప్రజలు, యువతతో మాట్లాడి శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవాలని తెలిపారు.ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని,సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చూడాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీపీ అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, బెల్లంపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News