- వెల్లడించిన తాజా అధ్యయనాలు..
వాయు కాలుష్యం కేవలం శ్వాసకోశ సమస్యలకే కాదు, తీవ్రమైన తలనొప్పులైన మైగ్రేన్‌లకు కూడా కారణమవుతుందనే విషయాన్ని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా కాలుష్య స్థాయులు పెరిగే రోజుల్లో మైగ్రేన్ ఎక్కువయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తేమ వంటి అంశాలు కూడా ఈ ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయని అధ్యయనం సూచిస్తోంది. ఈ పరిశోధనలో మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న 7 వేల మందికి పైగా వ్యక్తులను సుమారు 10 సంవత్సరాల పాటు పరిశీలించారు. వీరు నివసించే ప్రాంతాల్లో ట్రాఫిక్, పరిశ్రమలు, ధూళి తుఫాన్ల వల్ల ఏర్పడే వాయు కాలుష్య స్థాయిలు, అలాగే వాతావరణ పరిస్థితులను విశ్లేషించారు.
పరిశోధనలో పాల్గొన్నవారు ఎప్పుడు ఆసుపత్రులు లేదా క్లినిక్‌లను మైగ్రేన్ చికిత్స కోసం సందర్శించారో నమోదు చేసి, ఆ రోజుల్లో ఉన్న కాలుష్య స్థాయిలతో పోల్చారు. కాలుష్య ప్రభావం శరీరంపై కొన్ని రోజుల తరువాత కూడా కనిపించవచ్చని భావించి, సంఘటనకు ముందు ఏడురోజుల డేటాను కూడా పరిశీలించారు. అధ్యయన కాలంలో ఆసుపత్రి సందర్శనలు అత్యధికంగా నమోదైన రోజుల్లో గాల్లో ఉన్న పీఎం10 స్థాయిలు సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. సాధారణంగా 57.9 మైక్రాన్‌లు ప్రతి క్యూబిక్ మీటరుకు ఉండగా, అత్యధిక మైగ్రేన్ కేసులు నమోదైన రోజుల్లో ఇది 119.9 మైక్రాన్‌లకు చేరింది.
అదేవిధంగా సూక్ష్మ కాలుష్య కణాలైన పీఎం 2.5 స్థాయులు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. ఈ కణాలకు దీర్ఘకాలంగా గురైన వ్యక్తులు మైగ్రేన్ మందులను ఎక్కువగా వినియోగించే అవకాశం 9 శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. ట్రాఫిక్ కాలుష్యంతో విడుదలయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్‌వో2) స్థాయిలు కూడా మైగ్రేన్ తీవ్రతతో సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎన్‌వో2 స్థాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు మైగ్రేన్ మందుల వినియోగంలో 10 శాతం ఎక్కువ అవకాశాన్ని చూపించారు.
