- పింఛను లబ్ధిదారుల జీవన ప్రామాణీకరణపై జాగ్రత్త వహించాలి..
- ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య ..
ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకం (సామాజిక భద్రతా పింఛన్లు, ఆర్థిక సహాయం)లో పింఛన్లను బ్యాంకు ద్వారా పొందుతున్న లబ్ధిదారుల జీవన ప్రామాణీకరణ ఖచ్చితత్వంతో చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి అంజయ్య లతో కలిసి బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల పురపాలక సంఘాల సిబ్బందికి చేయూత పథకం లబ్ధిదారుల జీవన ప్రామాణీకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల పురపాలక సంఘాల పరిధిలో 27 వేల 854 మంది పింఛన్ దారులు లబ్ధి పొందుతున్నారని, వారి జీవన ప్రామాణీకరణను రాబోవు 15 రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పింఛన్ దారులు పాల్గొనేలా అవగాహన కల్పించాలని, ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం జీవన ప్రామాణీకరణ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో డిపిఎం అన్నాజీ, ఏపీఎం రాజ్ కుమార్, పురపాలక సంఘ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
