- పావులు కదుపుతున్న కాంగ్రెస్ సర్కార్..
- సక్సెస్ కు చిరునామా ఇంటర్ విద్య..
సంస్కరణలకు ఆద్యుడు.. తెలంగాణ తేజం పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఇంటర్ విద్యను కాలగర్భంలో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయ్యింది. దేశానికే ఆదర్శం, సక్సెస్‌కు చిరునామా అయిన ఇంటర్ విద్యను రద్దు చేయనున్నది. ఈ దిశలో సర్కార్ ఆగమేఘాల మీద కసరత్తు చేస్తున్నది. ఆర్డినెన్స్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. 1968లో అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలో ఇంటర్ బోర్డుకు అడుగులు పడ్డాయి. పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే ఇంటర్మీడియట్ విద్య ప్రారంభమైంది. అప్పటివరకు 11వ తరగతి హెచ్‌ఎస్‌సీగా, 12వ తరగతి పీయూసీ(ప్రీ యూనివర్సిటీ కోర్సు)గా కొనసాగేవి. దానిని సంస్కరించిన పీవీ ఇంటర్మీడియట్ విద్య పేరుతో కొత్త రూపాన్ని ఇచ్చారు.
1970 అక్టోబర్ 25న ఇంటర్మీడియట్‌గా మారుస్తూ అప్పటి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. 1969-70 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 120 పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఇంటర్ కోర్సులను ప్రారంభించారు. 1971లో ఇంటర్ బోర్డును ఏర్పాటు చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ఇంటర్ బోర్డు విద్యార్థులకు సేవలందిస్తున్నది. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నది. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన సంస్కరణకు.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే మంగళం పాడేందుకు ప్రయత్నిస్తున్నది. తమకు బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీ పార్టీ తెచ్చిన ఎన్‌ఈపీ పాలసీని అనుసరించి ఇంటర్ బోర్డును రద్దు చేయడానికి వేగంగా పావులు కదుపుతుండటం విశేషం.
