Saturday, May 9, 2026
HomeజాతీయంJayanti | ఉదార జాతీయ వాది… మితవాది గోఖలే

Jayanti | ఉదార జాతీయ వాది… మితవాది గోఖలే

  • మే 9… గోపాల కృష్ణ గోఖలే జయంతి

స్వాతంత్య్ర సమరంలో తెరముందు కనిపించి, పోరాట యోధులుగా, త్యాగ ధనులుగా, ప్రజా నాయకులుగా చరిత్ర పుటలకు ఎక్కిన వారు కొందరైతే, సమర నేపథ్యంలో తెర వెనుక నిశ్శబ్దంగా కార్యకలాపాలు సాగించిన వారెందరో. లక్ష్యం ఒకటే స్వాతంత్ర్య సాధన. మార్గాలు, కార్యాచరణ మార్గాలు వేరు.

స్వాతంత్య్ర సమరంలో నిరంతరం కదలాడుతూ, గాంధీజీ, నేతాజీ, తిలక్‌, లాలాలజపతి రాయ్‌, టంగుటూరి ప్రకాశం లాంటి యోధులు ముందు వరుసలో ఉంటే, నిశ్శబ్దంగా, నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉద్యమాలకు ఊపిరిపోసి, లక్ష్య సాధనలో తమ జీవితాల్ని జాతికి ధారపోసి, తెర వెనుక నిలిచిన వారెందరో… అలాంటి తెర వెనుక కార్యసాధకులలో అగ్రగణ్యులు గోపాలకృష్ణ గోఖలే.

- Advertisement -

ఆయన ఆంగ్లంలో నిష్ణాతుడవడమే మాకుండా పాశ్చాత్య రాజకీయాలను అవగాహన చేసుకున్నారు. పాశ్చాత్య తత్వ శాస్త్రాన్నీ ఆకళింపు చేసుకున్నారు. భారతీయ, పాశ్చాత్య సంస్కృతుల మధ్య సమన్వయకర్తగా నిలిచిన గోపాలకృష్ణ గోఖలేను అటు శ్వేత జాతి పాలకులు, ఇటు దేశీయ అధిక సంఖ్యాక నేతలు విశ్వసించారు. అలాంటి భిన్న వ్యక్తిత్వ కారణంగానే గాంధీ, ముహమ్మద్ అలీజిన్నా లాంటి వారిని ఆకట్టుకొని, వారిని తమ రాజకీయ ‘గురువు’ గా భావించేలా చేసింది.

గోపాలకృష్ణ గోఖలే (మే 9, 1866 – ఫిబ్రవరి 19, 1915) మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలోని కోట్లుక్‌లో 1886 మే 9న ఒక సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

విశ్వవిద్యాలయ స్థాయి విద్యను అభ్యసించిన తొలితరం భారతీయులలో ఆయన ఒకరు. జస్టిస్ రణడే శిష్యరికంలో భారతీయ అర్ధశాస్త్రాన్ని అభ్యసించి, పూనాలోని ఫెర్గూసన్‌ కళాశాలలో చరిత్ర, రాజకీయార్థ శాస్త్ర ఆచార్యునిగా చేరారు. తరువాత ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన పదవికి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు.

1900 సంవత్సరంలో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన గోఖలేకి అక్కడ ఫిరోజ్‌షా మెహతా సహచర్యం లభించింది. 1902 లో వైస్రాయ్ కౌన్సిల్ సభ్యులయ్యారు. ఆ సమయంలో అస్తవ్యస్తతమై ఉన్న భారత ఆర్ధిక వ్యవస్ధ గురించి గోఖలే ఉపన్యసించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. ఆయనలోని ఆర్ధిక వేత్తను ప్రంపంచానికి పరిచయం చేసింది. 1905 లో బెనారస్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో అధ్యక్షుడిగా ఎన్నికైనపుడు గోఖలే చేసిన ప్రసంగం నేటికీ అత్యుత్తమ ప్రసంగాలలో ఒకటిగా కీర్తించ బడుతోంది.1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. గొప్ప విద్యావేత్తగాను, పార్లమెంటేరియన్‌ గాను ఘనమైన చరిత్ర ఉంది.

1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటుచేశాడు. బ్రిటీష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించ కున్ననూ భారతీయులలో జాతీయతా భావాన్ని పెంపొందించ డానికి విశేష కృషిచేశారు.

విదేశాలలో వున్న భారతీయుల హక్కుల సాధన పట్ల శ్రద్ద క్రమంలో, దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించిన గాంధీ పరిచయం అయ్యారు. అలా వారి పరిచయం గురుశిష్యుల బంధంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల ప్రక్రియకు ఊతం అందించిన మాంటెగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ చట్ట రూపకల్పనలో, బెంగాల్‌ విభజన జరిగిన సందర్భంలో, భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రలో, బ్రిటిష్‌ ఇండియా చరిత్రలో గోఖలే పాత్ర ఎన్నదగినది.

(1905) కాశీలో జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సభలలో విదేశీ వస్తు బహిష్కరణ వంటి కీలక నిర్ణయం తీసుకున్న సభలకు అధ్యక్షునిగా గోఖలే ఉండడం గమనార్హం. బ్రిటిష్ పాలనకు విధేయత చూపిస్తూ దేశ వ్యవహారాలను నడిపించడంలో ఆయన మితవాదిగా ముద్ర వేసుకున్న నేపథ్యం. సైద్ధాంతిక భేదాలు ఉన్నా, గోఖలే తన ప్రత్యర్థులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు.

బొంబాయిలో, గోఖలే… బ్రిటిష్ ప్రభుత్వ కఠినమైన భూ ఆదాయ విధానాలను వ్యతిరేకించారు. ఉచిత మరియు నిర్బంధ ప్రాధమిక విద్యను సమర్థించారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడటానికి వెనకాడలేదు.

గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ని స్థాపించారు. గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పొలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (గోఖలే ఇన్‌స్టిట్యూట్ అనే పేరుతో ప్రసిద్ధి). భారత్ లో ప్రాచీన ఆర్థికశాస్త్ర విద్యాలయం. ఇది మహారాష్ట్ర పుణె లోని జింఖానా ప్రాంతంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారి ఆర్థిక సహాయముతో స్థాపించబడిన విద్యాలయం. నేటికినీ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వారే ఈ విద్యాలయానికి ట్రస్టీలు.

గోఖలే పిలుపు మేరకే గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికాను వీడి శాశ్వతంగా భారత దేశానికి వచ్చారు. పలువురిని ప్రభావితం చేసిన గోపాల కృష్ణ గోఖలే గాంధీజీ వచ్చిన దాదాపు నెల రోజులకే ఫిబ్రవరి 19, 1915న గోఖలే తుదిశ్వాస విడిచారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News