- వెంకటేశ్వర స్వామి అవతారం..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఒక్కో యుగంలో ఒక్కో అవతారాన్ని స్వీకరిస్తాడు. కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా ఇలపై వెలియడానికి కొన్ని దైవ సంబంధిత కారణాలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
నిరంతరం నారాయణ స్మరణతో తరించే నారద మహర్షి ఒకనాడు వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి “ప్రభూ! కలియుగంలో మానవుల ఆయుర్దాయం చాలా స్వల్పం. అయినా కూడా వారు ప్రాపంచిక విషయాలపై మక్కువతో భగవంతుని నామ స్మరణను విస్మరిస్తున్నారు. వారిని ఉద్ధరించే తరుణోపాయమే లేదా?” అని ప్రశ్నించాడంట! అప్పుడు నారాయణుడు నారదునితో “ఓ మునీంద్రా! కలియుగంలో నేను శేషాచలం కొండలపై శ్రీనివాసునిగా అవతరించబోతున్నాను.
మానవులు నా కొండకు ఒక్కసారి వచ్చి నన్ను దర్శించి నాకు తల నీలాలు సమర్పిస్తే చాలు వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. అంతేకాదు నా సన్నిధిలో ఒక్క ఆర్జిత సేవ చేసినా అశ్వమేథ యాగం చేసినంత పుణ్యం వారికి కలిగేలా అనుగ్రహిస్తాను. పాపభారం అధికంగా ఉండే కలియుగంలో నా భక్తుల కోసం నేను శ్రీనివాసునిగా అవతరంచి వారిని ఉద్ధరిస్తాను” అని శ్రీనివాసుడు నారద మహర్షికి తెలిపాడు. అన్నట్లుగానే శ్రీనివాసునిగా అవతరించి భక్తుల పాపాలు పోగొడుతున్నాడు. నారాయణుడు శ్రీనివాసునిగా వెలియడానికి ఇది మొదటి, ముఖ్యమైన కారణం.
