- హనీట్రాప్ కోణంలో దర్యాప్తు
కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హనీట్రాప్, ఎక్స్టార్షన్ వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం పోలీసు దర్యాప్తులో ఉన్నట్లు సమాచారం.అందిన వివరాల ప్రకారం, ఓ మహిళ తన కుమార్తెను అడ్డుపెట్టుకొని మంత్రి కుమారుడిని పక్కా ప్రణాళికతో హనీట్రాప్‌లోకి దింపే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ వేధింపులు, బెదిరింపులు అధికమవడంతో బాధితుడు కరీంనగర్ రెండవ పట్టణ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. సుమారు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేయాలనే ఉద్దేశంతో తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిసింది.ఇదిలా ఉండగా, సదరు మహిళ తన కుమార్తె వయస్సును తప్పుగా చూపిస్తూ కేసును మలుపుతిప్పే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మైనర్ బాలిక పేరుతో పోక్సో కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతూ, మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.డబ్బులు ఆశించిన మేరకు అందకపోవడంతో వ్యవహారాన్ని వివాదాస్పదం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ హనీట్రాప్ డ్రామా నడుస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై అధికారికంగా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఫిర్యాదు ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
