Thursday, May 7, 2026
Homeఆదిలాబాద్Collector | వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

Collector | వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు నగదు చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, పౌరసరఫరాల శాఖ అధికారులు, రవాణా గుత్తేదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు నగదు చెల్లింపు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనుగోలు పూర్తి చేయాలని తెలిపారు.

జిల్లాలో గోదాములను తక్షణమే ప్రారంభించి, ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని నిల్వ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 10 రైస్ మిల్లులు పని చేస్తున్నాయని, సుముఖ్ గోదాం సామర్థ్యం 20 వేల మెట్రిక్ టన్నులు ఉండగా, ఇతర గోదాముల సామర్థ్యం మొత్తం 61 వేల మెట్రిక్ టన్నులుగా ఉందని తెలిపారు. ఈ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిస్తూ నిల్వలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లకు మిల్లింగ్ చార్జీలు ఇప్పటికే విడుదల చేసినందున మిల్లర్లు ఆలస్యం చేయకుండా బిల్లుల ప్రకారం వరి ధాన్యం తీసుకుని మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.

- Advertisement -

మిల్లుల బ్యాంక్ గ్యారంటీలను సమీక్షించి, అర్హత ఉన్న మిల్లులకు వరి ధాన్యం విడుదల చేయాలని, జిల్లాలో మిల్లింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రవాణా వాహనాలను మిల్లులకు తగిన విధంగా కేటాయించి, వరి ధాన్యం రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే వరి తప్పనిసరిగా శుభ్రపరచి, నాణ్యత ప్రమాణాలను పాటించాలని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో సన్నాల సాగు 90 శాతానికి పైగా ఉన్నందున, కొనుగోలు పరిమాణాన్ని గత సంవత్సరాల కంటే మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అంతరాయాలు రాకుండా, హమాలి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న గోనె సంచులను మిల్లర్లు పరస్పర అవగాహనతో అవసరమైన చోట వినియోగించు కోవాలని, గోనె సంచుల కొరత ఎక్కడా లేకుండా చూసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తమ బాధ్యతలను క్రమంగా నిర్వర్తిస్తూ, రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలును పారదర్శకంగా చేపట్టి సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా  సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

అనంతరం జిల్లా సహకార శాఖ అధికారులతో వరి ధాన్యం కొనుగోలు పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే  ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలని తెలిపారు.

ఈ సంవత్సరంలో జిల్లాలో వరి ధాన్యం దిగుబడి అంచనా సుమారు 1 లక్ష 50 వేల మెట్రిక్ టన్నుల నుండి 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రాలలో వరి శుభ్రపరిచే యంత్రాలను ఏర్పాటు చేసి, రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో హమాలి చార్జీలకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రవాణా గుత్తేదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలు పూర్తైన తరువాత మాత్రమే రవాణా చార్జీలు చెల్లించబడతాయని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి సేవలు అందేలా సహకార శాఖ, సంబంధిత విభాగాలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News