Sunday, April 26, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంSwargaseema Suketana | కాగితాలపై స్వర్గం.. వాస్తవంలో అక్రమం

Swargaseema Suketana | కాగితాలపై స్వర్గం.. వాస్తవంలో అక్రమం

చండ్ర చంద్రశేఖర్ స్వర్గసీమ సుకేతనలో మోసాలు ముమ్మాటికి వాస్తవమే..

  • అక్రమాన్ని సక్రమమం చేయడానికి 45 రోజుల గడువు కోరిన చండ్ర
  • చట్టానికి విరుద్ధంగా గ్రీన్‌సిగ్నల్
  • నోటీసులిచ్చి నెలలు గడిచినా, అటువైపు కన్నెత్తి చూడని వైనం..
  • తక్షణమే రంగారెడ్డి జిల్లా డీపీఓ స్పందించి చర్యలు తీసుకోవాలి..
  • పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 268 ప్రకారం కార్యదర్శి అశోక్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్

రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం, చెరుకుపల్లి గ్రామపంచాయితీలో సెక్రెటరీగా విధులు వెలగబెడుతున్న అశోక్.. తానే చట్టం చేస్తున్నాడు.. పంచాయితీరాజ్ చట్టాన్ని తుంగలో తొక్కాడు.. ఓ అక్రమ వెంచర్ లేఅవుట్ సక్రమం చేయడానికి.. అక్రమ నిర్మాణదారుడికి ఈయనగారు పర్మిషన్ ఇచ్చాడట.. అయినా అడగడానికి ఆయనెవరు..? ఇవ్వడానికి ఈయనెవరు..? ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు..? చట్టాలు ఎందుకు..? న్యాయస్థానాలు ఎందుకు..? ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..

- Advertisement -

రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం, చెరుకుపల్లి గ్రామ శివారులో స్వర్గసీమ సుకేతన పేరుతో అక్రమ లేఅవుట్ వెలిసింది.. చండ్ర చంద్రశేఖర్ విభిన్న వేషాలు వేస్తూ.. కస్టమర్లను బురిడీ కొట్టిస్తూ, అక్రమాలకు తెరలేపాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అమాయకపు ప్రజలకు లేనివి వున్నట్టుగా చూపిస్తూ, ప్లాట్లను అంటగట్టి, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాడనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. చండ్ర చంద్రశేఖర్ చేస్తున్న అక్రమాలను ఆధారాలతో సహా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే.. సదరు కథనాలను పరిగణలోకి తీసుకున్న జిల్లా పంచాయితీ అధికారి తక్షణమే విచారణకు ఆదేశాలిచ్చారు..

డీపీఓ ఆదేశాలమేరకు విచారణ జరిపిన అధికారులు చండ్ర చంద్రశేఖర్ వెంచర్ ముమ్మాటికీ అక్రమమే అని తేల్చి చెప్పారు.. ఇదే విషయంపై పంచాయితీరాజ్ చట్టం 2018 నిబంధనల ప్రకారం రెండు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. రోజులు గడచినా చర్యలు చేపట్టకపోవడంతో అవినీతి మత్తులో మునిగి తేలుతున్న కార్యదర్శిని చట్టప్రకారం నేటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని వివరణ అడుగగా..స్వర్గసీమ సుకేతన యజమాని చండ్ర చంద్రశేఖర్ తన అక్రమాలను సక్రమం చేసుకోవడానికి 45 రోజులు సమయం కోరాడట..

అందుకు పంచాయితీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా చెరుకుపల్లి కార్యదర్శి అశోక్ పచ్చజండా ఊపడం పలు అనుమానాలకు తావిస్తోంది.. కాగా ఇప్పటికి 35 రోజులు గడువు గడిచిందని, ఇంకో పది రోజుల్లో అన్నీ చక్కబెట్టుకుంటానని సదరు చండ్రకు వత్తాసు గా కార్యదర్శి అశోక్ చెప్పడం గమనార్హం.. కాగా గతంలో నోటీసులు ఇచ్చి 7 రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పిన కార్యదర్శి అశోక్ రెండు నెలలు గడచినా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.. అయితే కార్యదర్శి చండ్ర చంద్రశేఖర్ కు 45 రోజులు గడువు ఇచ్చినందుకు కాలయాపన చేస్తున్నాడా..? అసలు కార్యదర్శి పంచాయితీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా సొంత నిర్ణయం తీసుకుని సదరు చండ్రకు ఏవిధంగా గడువు ఇచ్చాడో ఆశ్చర్యంగా వుంది..

కార్యదర్శి వ్యవహార తీరు చూస్తే.. అక్రమార్కులు ఇచ్చింది తీసుకుంటాం.. వారు చెప్పిందే చేస్తాం.. అని వింతపోకడలకు పోతున్న కార్యదర్శి వ్యవహారం పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పంచాయితీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 268 ప్రకారం విధుల నుండి కార్యదర్శిని తొలగించాలని చట్టం చెబుతోంది.. ఇన్ని జరుగుతున్న కూడా ఒకవైపు స్వర్గసీమ సుకేతన వెంచర్ లో చూపిస్తున్న సర్వే నెంబర్లు సబ్ డివిజన్లుగా ఉండి నేటికీ భూభారతి రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే ఉన్నాయి అన్నది జగమెరిగిన సత్యం..

నేటికి ఈ అక్రమ లేఅవుట్ అనుమతి ఎందుకు రద్దు చేయలేదని పలువురు సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా పంచాయితీ అధికారి స్పందించి సదరు చెరుకుపల్లి కార్యదర్శి అశోక్ ని తక్షణమే విధులనుంచి తొలగించి.. అక్రమ వెంచర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, సైన్ బోర్డులు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు..

ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తున్న చండ్ర చంద్రశేఖర్ :

ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం భరించలేక.. తాను చేస్తున్న మోసాలను బట్టబయలు చేయడంతో ఆ తప్పులను కప్పిపుచ్చుతూ మరలా కస్టమర్లను మోసం చేసే పనిలో నిమగ్నమైయ్యాడు చండ్ర.. పంచాయితీరాజ్ చట్టం 2018 లోని జీవో ఎం.ఎస్. నెం. 67 తేదీ: 26022002 ప్రకారం సెక్షన్ 113 ప్రకారం లేఅవుట్ అనుమతి కోసం పాటించాల్సిన నిబంధనలు తేలుపుతోంది.. దీని ప్రకారం ఆన్ లైన్ లో ఈ పంచాయితీ వెబ్ సైట్ లో లేఅవుట్ అనుమతికోసం దరఖాస్తు చేసుకోవాలి అన్నది చట్టం.. చండ్ర చంద్రశేఖర్ దీని ప్రకారం తేదీ. 14042023 రోజున లేఅవుట్ అనుమతి కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాడు..

దాని ఎల్.పీ. నెం. 1875..గా ఆన్ లైన్ లో నమోదై వుంది.. ఇట్టి అనుమతి నేటికీ ఇవ్వనట్టుగానే ఆన్ లైన్ లో చూపిస్తోంది.. ఒకవైపు భూభారతి రికార్డుల్లో వాళ్ళు చూపించిన సర్వే నెంబర్లు వ్యవసాయ భూములుగా ఉన్నాయి.. మరోవైపు ఆన్ లైన్ అనుమతి లేదు.. ఇంకోవైపు అధికారులు అక్రమ వెంచర్ అని నోటీసులు ఇచ్చారు.. ఓ.ఆర్.సి. లేకుండానే ఇనాం పట్టా చేసుకున్నాడు చండ్ర చంద్ర శేఖర్.. ఇన్ని అక్రమాలు కళ్లెదుటే పెట్టుకుని తాను చేసే వెంచర్ సక్రమమే అని నేటికీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు.. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత జరుగుతున్నా, ఇన్ని సాక్ష్యాలు వెలుగుచూస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పొందిన మ్యాన్యువల్ అనుమతిని ఎందుకు రద్దు చేయడం లేదో అంతుచిక్కని ప్రశ్నగా మారింది..

ఇప్పటికైనా జిల్లా పంచాయితీ రాజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసి చండ్ర చంద్రశేఖర్ చేతిలో మోసపోకుండా అప్రమత్తం చేయాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.. అదేవిధంగా రేరా చైర్మన్ సత్యనారాయణ కూడా దృష్టిసారించి ఈ వ్యవహారాన్ని సుమోటాగా తీసుకుని భూభారతి రికార్డులను, ఈ పంచాయితీ వెబ్ సైట్ లో నేటికి అనుమతి లేదన్న ఆధారాన్ని, పంచాయితీరాజ్ శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులను పరిగణలోకి తీసుకుని..

రేరా వెబ్ సైట్ లో స్వర్గసీమ సుకేతన అక్రమ వెంచర్ అని బ్లాక్ లిస్ట్ లో పెట్టేవిధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, కష్టమర్లు నష్టపోకుండా అప్రమత్తం చేయాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. చండ్ర చంద్రశేఖర్ చేస్తున్న మోసాలకు సంబంధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది..

“ఆదాబ్ హైదరాబాద్” “మా అక్షరం అవినీతిపై అస్త్రం “..

- Advertisement -
RELATED ARTICLES

Latest News