అంగన్వాడీ కార్యకర్తలు గ్రామస్థాయిలో సేవలందించే సైనికులని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అభివర్ణించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూపాలపల్లి ప్రాజెక్ట్, జయ శంకర్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ ల పంపిణీ కార్యక్రమం, సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్న సేవలు అమోఘమని అభినందించారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడీల సేవలు ఎంతో దోహద పడుతున్నాయన్నారు. ప్రతి బిడ్డకు కనీసం ఆరు నెలలు తల్లిపాలు అందేలా చూడాలని, పోషకాహారం తీసుకునేలా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను చైతన్య పరచాలని సూచించారు. అంగన్వాడీల సేవలను మరింత పారదర్శకంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే వారికి స్మార్ట్ ఫోన్ లను అందజేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ సర్వేల్లో అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది భాగస్వాములవుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూపాలపల్లి డివిజన్ లోని 418 మంది అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి స్మార్ట్ ఫోన్ లు అందజేసినట్లు తెలిపారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా పోషణ మాసం నిర్వహించినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో గర్భిణీలు, చిన్నారులకు సేవలను అందించడంలో అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ప్రతి చిన్నారి, గర్భిణీ వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని, ప్రభుత్వం అందించే పథకాల సమర్థవంతమైన అమలుకు అది దోహదపడుతుందని సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఆరోగ్య రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మారుమూల ప్రాంతాల్లో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అనంతరం చిన్నారుల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అందజేశారు. అదేవిధంగా ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల జాబితాను సమర్పించాలని, వాటికి స్థలాలను కేటాయించి నిధులను మంజూరు చేసి భవనాల నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా మొగుళ్ళపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల టీచర్లు స్మార్ట్ ఫోన్లను అందుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల సూపర్వైజర్ రజిత వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల్ లీడర్ శ్రీవాణి, సర్కిల్ లీడర్ చెవ్వ స్వరూప, రాణి అంగన్వాడీ కేంద్రాల టీచర్లు రజిత, వెన్నెల, స్వప్న, అనిత, అశ్విని, రోజా, జమున, జ్యోతి, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
