- హెచ్చరించిన ట్రంప్..
హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. జలసంధి అంశాన్ని తీసుకుని అమెరికాను బ్లాక్‌మెయిల్ చేయాలని ప్రయత్నించవద్దని స్పష్టంగా హెచ్చరించారు. వైట్‌హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ తరుణంలోనే ఇరాన్ పాలకులు జలసంధిని మళ్లీ మూసివేయాలనే చర్యలకు దిగుతున్నారని ట్రంప్ మండిపడ్డారు.
గతంలోనూ ఇదేవిధంగా వ్యవహరించారని, అయితే అమెరికాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురిచేయలేరని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ శాంతి చర్చల విషయంలో మరో ప్రకటన చేసింది. అమెరికా ప్రతిపాదించిన కొత్త ఆఫర్లను పరిశీలిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆ ప్రతిపాదనలను తమకు అందజేశారని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది.
అయితే ఆ ప్రతిపాదనల వివరాలను మాత్రం బయటపెట్టలేదు. అమెరికా తన డిమాండ్లను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరాన్ సూచించింది. యుద్ధం పూర్తిగా ముగిసే వరకు హర్మూజ్ జలసంధి రాకపోకలపై పూర్తి నియంత్రణ కొనసాగిస్తామని కూడా ఇరాన్ స్పష్టం చేసింది.
