Tuesday, April 21, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంEncroachment | కామాయకుంటను కాజేశారు..

Encroachment | కామాయకుంటను కాజేశారు..

  • అప్పనపల్లిలో 18 ఎకరాల కుంట కనుమరుగు..
  • మేయర్ స్వంత గ్రామంలో కుంట మాయమైతే పట్టింపులేదా ?
  • గతంలో మంచి నీటి చెరువు.. నేడు అక్రమార్కుల లేఅవుట్
  • రికార్డుల్లో చెరువు మాయమైన పట్టించుకోని ఇరిగేషన్ శాఖ..
  • ప్రభుత్వం, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి..
  • డిమాండ్ చేస్తున్న అప్పనపల్లి గ్రామస్తులు..

ఎనుకటికీ ఓ సామెత ఉంది..ఎనుకనుంచి ఏనుగు పోయిన పర్లేదు గాని ముందు నుంచి ఒక్క చీమ కూడా పోవద్దని కుర్చేసుకొని కూర్చున్నాడట ఓ పెద్దమనిషి .. అన్నట్లు ఉంది ప్రస్తుతం ప్రభుత్వ ధోరణి..నగరాల్లో మురికి కాలువల చుట్టూ తిరుగుతున్న అధికారులు పల్లెల్లో మాత్రం కుంటలు, చెరువులు ఎకరాల కొద్దీ మాయమవుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి నిదర్శనంగా మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లి విలీన గ్రామం నిలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ గ్రామంలో సర్వే నంబర్ 109,110,111,112 పేరిట మొత్తం 204 ఎకరాల స్థలం ఉంది..

ఇందులో పోసాని కుంట (145 ఎకరాలు), షిర్పోనీ కుంట (16 ఎకరాలు), కామయకుంట (18 ఎకరాలు), గంగోసు కుంట (25 ఎకరాలు) ఉన్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశ్చర్యకరంగా కామయకుంట 18 ఎకరాల స్థలం రికార్డుల్లో పూర్తిగా మాయమైంది.. అధికారుల లెక్కల్లో ఇది కుంటగా లేదు, స్థలంగా కూడా లేదు.గతంలో ఈ కుంట ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యక్తులు.. చెరువు కట్ట, అలుగు ధ్వంసానికి కూడా యత్నించగా ..స్థానికుల ఆందోళనలు, పోలీసు కేసులతో అవి అడ్డుకట్ట వేయబడ్డాయి.

- Advertisement -

అయినప్పటికీ అన్ని వివాదాల నడుమ ఈ 18 ఎకరాల కుంటను అప్పటి గులాబీ నేతలు కొంతమంది అధికారులతో కలిసి మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎన్ని రికార్డులు పరిశీలించినా కామయకుంట జాడ కనిపించకపోవడం మరింత అనుమానాలకు దారితీస్తోంది. చెరువు రికార్డుల్లో లేకపోవడం వల్ల పర్యావరణానికి, ప్రజా వనరులకు, ముఖ్యంగా మత్స్యకారుల జీవనోపాధికి తీవ్రమైన ముప్పు ఏర్పడింది. నగరాల్లో కఠిన చర్యలు తీసుకునే ప్రభుత్వం పల్లెల్లో ఇలాంటి కీలక వనరులు మాయమవుతున్నా ఎందుకు మౌనం పాటిస్తోందన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తోంది.

ప్రభుత్వం,అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి :
బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ డిమాండ్ :

మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లి ఎఫ్సీఎస్ పరిధిలోని కామయకుంట చెరువు పరిరక్షణ విషయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కామయకుంటను రక్షించాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాను సమర్పించిన ఫిర్యాదులో చెరువుకు సంబంధించిన అనుమానాస్పద వివరాలను ప్రస్తావించారు.. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ గతంలో కామయకుంటను 204 ఎకరాల వాటర్ స్ప్రెడ్ ఏరియా కలిగిన చెరువుగా గుర్తించిన విషయాన్నీ కలెక్టరుకు వివరించారు..

ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం ఎఫ్సీఎస్ రిజిస్ట్రేషన్ కోసం సర్టిఫికేట్ జారీ చేసినప్పటికీ, ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరితే చెరువు వివరాలు ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందని చెప్పుకొచ్చారు.. ఇది సాధారణ పరిపాలనా లోపం కాదని, చెరువును అధికారిక రికార్డుల నుంచి తొలగించి అక్రమ ఆక్రమణలకు మార్గం సుగమం చేసే కుట్రగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని ప్రత్యేక అంశం జాబితాలో చేర్చుకొని పరిశీలించాలని కోరారు..

మేయర్ స్వంత గ్రామంలో 18 ఎకరాల కుంట మాయం :

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గుమ్మాల మమత శ్రీనివాస్ ముదిరాజ్ కార్పొరేటర్‌గా గెలిచి, ఫిబ్రవరి 2026లో మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఆమెది అప్పన్న పల్లి విలీన గ్రామం.. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధి కోసం ఆమె నిరంతరం కృషి చేస్తున్నాని ప్రమాణం కూడా చేశారు.. మున్సిపాలిటీకి సంబంధించి పారిశుధ్యం, రోడ్లు, తాగునీరు వంటి ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ విచిత్రమేటంటే ఆమె స్వంత గ్రామంలో 18 ఎకరాల కుంట మాయమైతే దృష్టి సారించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

బాద్యులపై చర్యలకు గ్రామస్తుల డిమాండ్ :

ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన పర్యావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది,ఆర్టికల్ 48ఏ ప్రకారం జల వనరులను రక్షించడం రాష్ట్ర బాధ్యత,ఆర్టికల్ 51ఏ (జి ) ప్రకారం ప్రకృతి వనరులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యము. ఈ అంశంపై ప్రభుత్వం,అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు..అంతే కాకుండా కా మయకుంటను అధికారిక రికార్డుల్లో వెంటనే చేర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.బఫర్ జోన్ ప్రాంతాలను కట్టుదిట్టంగా రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు..అంతేకాకుండా బాధ్యులపై సివిల్,క్రిమినల్ కేసులు నమోదు చేయాలని..మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని కోరుతున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News