- అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులను చేస్తున్న వైనం..
- ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్న పట్టించుకోని అధికారులు..
- అక్రమాలపై నేటికీ నమోదు కాని కేసులు..
- అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయి.
- మామూళ్ల మత్తులో ఆ వైపు కన్నెత్తి చూడని అధికారులు..?
- రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామంటున్న ఏ.డి. రవిశంకర్
హన్మకొండ జిల్లాలోని, శాయంపేట మండలం, పత్తిపాక గ్రామంలో అక్రమ మైనింగ్ దందా రోజురోజుకు విస్తరిస్తూ, ప్రజల జీవితాలను నరకయాతన చేస్తోంది.. అనుమతులకు మించి జరుగుతున్న తవ్వకాలు, నిర్బంధం లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్ కార్యకలాపాలు గ్రామస్థుల్లో భయాందోళనలను కలిగిస్తున్నాయి. చట్టాలు ఉన్నా, అమలుకు నోచుకోకపోవడం వల్ల మైనింగ్ మాఫియా దూకుడుగా, దుర్మార్గంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రామ పరిసర ప్రాంతాల్లో భారీ యంత్రాలతో నిరంతరం తవ్వకాలు కొనసాగుతుండగా, భూమి కంపించేలా జరుగుతున్న బ్లాస్టింగ్‌లు ప్రజల నిద్రను హరించేస్తున్నాయి. ఇళ్ల గోడలు పగిలిపోవడం, పంట పొలాల్లో పగుళ్లు ఏర్పడటం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వంటి సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. రైతులు తమ భూములు కాపాడుకోవాలా..? ప్రాణాలు కాపాడుకోవాలా అనే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, మైనింగ్ నిర్వాహకులు అధికార అనుమతులను అతిక్రమించి, నియమ నిబంధనలను పక్కన పెట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై స్పందించాల్సిన అధికారులు మాత్రం మౌనం వీడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మామూళ్ల మత్తులో అధికారులు కళ్లుమూస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి..

బ్లాస్టింగ్‌ల వల్ల పాఠశాలలకు వెళ్లే పిల్లలు కూడా భయంతో వణికిపోతున్నారు. పెద్ద శబ్దాలతో భూమి కంపించడం వల్ల వృద్ధులు, మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ధూళి కాలుష్యం కారణంగా శ్వాస సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ, “మా పొలాలు, మా జీవనాధారం నాశనం అవుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మాకు న్యాయం చేయాలి” అని వేడుకుంటున్నారు. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్న ఈ అక్రమ మైనింగ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం, సంబంధిత శాఖలు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు..
ఫీల్డ్ స్టాఫ్‌ను పంపించి పూర్తి స్థాయి నివేదికను సేకరిస్తాం. నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం అని మైనింగ్ ఏ. డి. రవిశంకర్ తెలిపారు..
