- అంతర్గత కొవ్వు పెరగడమే కారణం..
- అవయవాల పని తీరు దెబ్బతింటుంది..
శరీర బరువు సాధారణంగా ఉండటం ఆరోగ్యానికి సూచికగా భావించడం ఇప్పటివరకు సాధారణంగా ఉన్న అభిప్రాయం. అయితే ప్రస్తుత కాలంలో బరువు సాధారణంగా ఉన్నప్పటికీ, అనేక మంది మెటాబాలిక్ సమస్యలు, ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో కనిపించని అంతర్గత కొవ్వు పెరగడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విస్సెరల్ ఫ్యాట్ పొట్ట భాగంలో ఉండి కాలేయం, ప్యాంక్రియాస్, కిడ్నీల వంటి ముఖ్య అవయవాల చుట్టూ చేరుతుంది. ఇది సాధారణ కొవ్వు కాదు, ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను పెంచే రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల అవయవాల పనితీరు దెబ్బతింటుంది.
బయటకు సన్నగా కనిపించే వారిలో కూడా ఈ సమస్య ఉండటం వల్ల దీనిని థిన్-ఫ్యాట్ ఫెనోటైప్ గా పిలుస్తున్నారు. విస్సెరల్ ఫ్యాట్ పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, హై బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి క్రమంగా కిడ్నీల్లోని చిన్న ఫిల్టర్లను దెబ్బతీసి, చివరికి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి దారితీస్తాయి. ముఖ్యంగా ఈ మార్పులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా కొనసాగడం వల్ల సమస్య మరింత ప్రమాదకరంగా మారుతోంది. దక్షిణాసియా ప్రజల్లో, ముఖ్యంగా భారతీయుల్లో, ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
జన్యుపరమైన లక్షణాల వల్ల తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ఉన్నప్పటికీ, అంతర్గత కొవ్వు ఎక్కువగా నిల్వ అవుతుంది. అందుకే ఆసియా ప్రజల కోసం బీ ఎం ఐ ప్రమాణాలు కూడా వేరుగా ఉంటాయి. 18.5-22.9 మధ్య బీ ఎం ఐ సాధారణంగా పరిగణించబడితే, 23 పైగా ఉంటేనే ప్రమాద సూచనలు ప్రారంభమవుతాయి. అలాగే చాలా మంది తీసుకునే అసమతుల్య ఆహారం కూడా దీనికి ప్రధాన కారణంగా మారుతోంది. అధికంగా రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు తీసుకోవడం, ప్రోటీన్ తక్కువగా ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీర నిర్మాణం దెబ్బతింటుంది. ముఖ్యంగా యువతలో కండరాల మాస్ తగ్గిపోవడం వల్ల మెటాబాలిజం బలహీనమై, అంతర్గత కొవ్వు పెరుగుతుంది.
