- వందేభారత్ ట్రైన్ ఆహారంలో పురుగులు..
- ఫిర్యాదు చేసిన ఒక ప్రయాణీకుడు..
ఒక ప్రయాణికుడి ఫిర్యాదు నేపథ్యంలో, రైల్వే మంత్రిత్వ శాఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)పై రూ. 10 లక్షల జరిమానా విధించింది. మార్చి 15న పాట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో అందించిన ఆహార నాణ్యతపై ఒక ప్రయాణికుడు చేసిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన ఇండియన్ రైల్వేస్ ఐఆర్‌సీటీసీపై భారీ జరిమానా విధించింది.
రితేశ్ కుమార్ మార్చి 15న పాట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించారు. ఆ సమయంలో తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో ఆయన మేనేజర్‌ను పిలిచి ఫిర్యాదు చేశారు. రైలు సిబ్బంది ఆ భోజనాన్ని పరిశీలించారు. రితేశ్ ఈ ఉదంతాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది.
ఐఆర్‌సీటీసికి రూ.10 లక్షల జరిమానా విధించడంతో పాటు, సంబంధిత కేటరింగ్ సర్వీస్ ప్రొవైడర్‌పై రూ.50 లక్షల జరిమానా విధించింది. అలాగే కాంట్రాక్టును రద్దు చేసినట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత, నాణ్యతే తమ ప్రధాన ప్రాధాన్యతలని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది. కాగా, ఇండియన్ రైల్వేస్ తన రైళ్లలో ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను అందిస్తోందని, అధిక ఛార్జీలకు సంబంధించిన ఫిర్యాదులతో సహా, ఫిర్యాదులు సగటున 0.0008 శాతం మాత్రమే ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
