- వెల్లడించిన మంత్రి నారా లోకేష్..
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని, ఒప్పందాలకే పరిమితం కాకుండా పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని మయూరి టెక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ఆయన ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కార్యాలయాన్ని పరిశీలించారు.
అనంతరం ఏపీఈడీబీ అధికారులతో సమావేశమైన లోకేశ్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. “యువగళం పాదయాత్రలో యువతకు 20 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాను. జీడీ నెల్లూరులో బజ్జీలు అమ్ముకునే మోహన అనే మహిళ నన్ను కలిసి, ప్రభుత్వ సాయం వద్దని, తన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తే చాలని కోరారు. ప్రజల ఆకాంక్ష ఇదే. అందుకే ఉద్యోగాల కల్పనే మన సింగిల్ పాయింట్ ఎజెండా కావాలి” అని లోకేశ్ ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం ఏపీఈడీబీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు.
గత టీడీపీ హయాంలో కేవలం 20 నెలల కాలంలోనే దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి తీసుకురాగలిగామని, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రాన్ని ఎంచుకున్నాయని లోకేశ్ గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. “నూతన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను గ్రౌండింగ్ చేయడం మన ప్రధాన లక్ష్యం. గుర్తించిన 22 క్లస్టర్లలో అధికారులు నిపుణులుగా ఎదగాలి.
ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లకుండా చూడాలి” అని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయని, ఈ నెల 23న రెండో స్టీల్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు. అమరావతిలో పనులు వేగంగా సాగుతున్నాయని, ఏప్రిల్ చివరి నాటికి ఉండవల్లి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, ఏపీఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
