- లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన
- 2030 నాటికి 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం
- ఖమ్మం ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం
దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి విస్తరణ, పర్యావరణ ప్రభావం మరియు భవిష్యత్ ప్రణాళికలపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు. 2050 నాటికి ‘నెట్ జీరో’ కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పాత్రను, ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం గుర్తించిన ప్రాంతాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎంపీ రఘురాం రెడ్డి లేవనెత్తిన ఈ అంశాలపై కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఎంపీ రఘురాం రెడ్డి ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇదీ..
భారీ ఉత్పత్తి లక్ష్యం: 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీకి వివరించారు.
SIGHT పథకం కింద ప్రోత్సాహకాలు: గ్రీన్ హైడ్రోజన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘సైట్’ (SIGHT) కార్యక్రమం ద్వారా రాయితీలు ఇస్తున్నామని, ఇప్పటికే 18 కంపెనీలకు 8.62 లక్షల టన్నుల ఉత్పత్తికి అనుమతులు ఇచ్చామని తెలిపారు.
గ్రీన్ అమోనియా సరఫరా: దేశవ్యాప్తంగా 13 ఎరువుల యూనిట్లకు ఏడాదికి 7.24 లక్షల మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియాను సరఫరా చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
పర్యావరణ వెసులుబాటు: ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన పర్యావరణ అనుమతుల అంశంపై స్పందిస్తూ.. నీటిని ఎలెక్ట్రోలిసిస్ విధానంలో ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే యూనిట్లకు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ప్రపంచ కేంద్రంగా భారత్
భారత్‌ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో ప్రపంచ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచుతున్నామని కేంద్రం రఘురాం రెడ్డికి తెలియజేసింది. ప్లాంట్ల ఏర్పాటు అనేది ఆయా కంపెనీల వాణిజ్య అవసరాల మేరకు జరుగుతుందని మంత్రి వివరించారు.
