- విజృంభిస్తున్న ఇజ్రాయెల్..
భీకర రీతిలో ఇజ్రాయెల్ ఇవాళ మళ్లీ వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-35ఐ యుద్ధ విమానం ఇవాళ టెహ్రాన్ గగనతలంలో యాక్-130 జెట్‌ను కూల్చివేసింది. కొన్ని క్షణాల క్రితం రష్యా తయారీకి చెందిన యాక్-130 జెట్‌ను కూల్చినట్లు ఐడీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఐడీఎఫ్ తన ఎక్స్ అకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఎఫ్-35 యుద్ధ విమానం.. రణరంగంలో ఓ మానవసహిత విమానాన్ని కూల్చడం ఇదే మొదటిసారి. అయితే గడిచిన 40 ఏళ్లలో తొలిసారి ఇజ్రాయెల్ వైమానిక దళాలు మానవసహిత ఎయిర్-టు ఎయిర్- కంబాట్‌లో పాల్గొన్నాయి. 1985 నవంబర్ 24వ తేదీన చివరిసారి ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్ గగనతలంలో శత్రు విమానాన్ని కూల్చివేసింది. ఆ సమయంలో సిరియాకు చెందిన మిగ్-23 ఫైటర్ విమానాలను ఐఏఎఫ్ ఎఫ్-15 నేలకూల్చింది.
