Monday, March 2, 2026
Homeసాహిత్యంBiodiversity | ఔషధ మొక్కలతో ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధులు

Biodiversity | ఔషధ మొక్కలతో ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధులు

  • 03 మార్చి “ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం”

నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్ యుగం వరకు కూడా ప్రపంచ మానవాళి ఆహారం, ఔషధాలు, గృహనిర్మాణం, ఇంధనం, వస్త్రాల కోసం వనాలపై లేదా అటవీ వృక్ష జంతుజాలాలపై ఆధారపడి ఉంటున్నాడు. ప్రకృతి సహజ అందాల విందులు ఆరబోస్తున్న అటవీ సంపద పర్యావరణ వ్యవస్థను కాపాడడం జరుగుతున్నప్పటికీ మానవ తప్పిదాలతో వన్యప్రాణుల సంఖ్య తగ్గడం, జీవ వైవిధ్యానికి విఘాతం కలగడం జరుగుతున్నది.

అన్ని రకాల వృక్ష జంతు జాతులతో మనిషి కలిసి స్నేహంగా జీవితాలను గడపని యెడల రాబోయే తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వన్యప్రాణుల సమతుల్యత దెబ్బతినకుండా వాటిని రక్షించుకుంటూ, జీవవైవిధ్యానికి పట్టం కట్టవలసిన సమయం ఆసన్నమైనది. భూమిపై సహజంగా జీవితాలను గడుపుతున్న అనేక రకాల జీవరాసులను పరిరక్షించుకోనిఎడల పలు జాతులు అంతరించే ప్రమాదంతో పాటు మానవ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని అందరం తెలుసుకోవాలి.

- Advertisement -

భావితరాల మనుగడకు జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థల సమతుల్యత:

మన పిల్లలకు అపార సంపదలను సంపాదించిపెట్టినప్పటికీ తాగడానికి చుక్క శుద్ధ జలం, పీల్చడానికి పరిశుద్ధ గాలి లేనపుడు మనిషి వద్ద ఎన్ని ఉన్నా నిరర్ధకమే అవుతాయని తెలుసుకోవాలి. పర్యావరణ వ్యవస్థను కాపాడడం, జీవ వైవిధ్యాలను సంరక్షించడం, సహజ ప్రక్రియలను నియంత్రించడం, మానవ జాతికి కనీస అవసరాలు తీర్చడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరడానికి వన్యప్రాణులు అమూల్య సేవలను అందిస్తున్నాయి.

మనిషి అడక ముందే కూడు, గూడ, గుడ్డను ఇస్తున్న వన్యప్రాణుల పరిరక్షణ అవసరాలను ప్రజల్లో ఏకరువు పెట్టడానికి, అవసర హెచ్చరికలు చేయడానికి ప్రతి ఏట 03 మార్చి “ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం” లేదా “వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ డే” నిర్వహించడం జరుగుతున్నది. అడవుల్లో దాదాపు 60,000 వృక్ష జాతులు, 80 శాంతం ఉభయచర జాతులు, 75 శాతం పక్షి జాతులు ప్రపంచవ్యాప్త 1.6 మిలియన్ల ప్రజలకు నేరుగా నిత్యావసరాలను తీర్చుతున్నాయి.

2026 ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఇతివృత్తం:

నేటి జీవజాతుల్లో దాదాపు ఒక మిలియన్‌ వరకు అంతరించే అంచున ఉన్నాయనే భయంకర వాస్తవమే నిజమైతే మానవ శాంతియుత జీవనం బుగ్గిపాలు కావడం తప్పనిసరి. భూమిని, భూగ్రహంపై సహజంగా జీవిస్తున్న జీవరాశులను కాపాడకపోవడం మన కనీస కర్తవ్యం అని తెలుసుకొనుటతో పాటు జీవవైవిధ్య పరిరక్షణకు అవసర నిధులు కూడా అందించి సహకరించడం ప్రధాన అంశమని ఐరాస పేర్కొంటున్నది.

ప్రపంచ సగం జిడిపీ ప్రకృతి సంపద మీదనే ఆధారపడి ఉంటున్నది. జీవవైవిధ్య పరిరక్షణకు లేదా పునర్నిర్మాణానికి ప్రతి ఏట 143 బిలియన్ల డాలర్ల నిధులను ప్రపంచ దేశాలు అందిస్తున్నాయని, ఈ సత్కార్య నిర్వహణకు 824 బిలియన్‌ డాలర్లు అవసరం అవుతాయని, కనీసం ఏడాదికి 500 బిలియన్‌ డాలర్లు అయినా ప్రపంచ దేశాలు వెచ్చించాలని ఐరాస పేర్కొనడం విశేషం.

“ఇంటర్నేషన్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎండేంజర్డ్‌ స్పీసీస్‌ ఆఫ్‌ వైల్డ్‌ ఫానా అండ్‌ ఫ్లోరా” అనే సంస్థ 50వ వర్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో వన్యప్రాణుల పరిరక్షణ కార్యాలు పటిష్ట పథకాలతో నడవాలి. ప్రపంచ వన్యప్రాణుల దినం-2026 ఇతివృత్తంగా “ఔషధ, ఆరోమాటిక్‌ మొక్కలు : ఆరోగ్య, వారసత్వ, జీవనోపాధి సంరక్షణ” అనబడే అంశాన్ని తీసుకున్నారు. ప్రపంచ మానవాళి ఆయురారోగ్యాలకు జీవవైవిధ్యంతో పాటు పర్యావరణ వ్యవస్థల సమతుల్యత అవసరం అవుతాయని, వీటి సాధనకు అవసరమైన ఆర్థిక నిధులు అందించారని ప్రపంచ దేశాలను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలను కోరడం జరుగుతున్నది.

ప్రపంచ వన్యప్రాణుల దినం వేదికగా చేయదగిన కార్యక్రమాలు:

ప్రపంచ వన్యప్రాణుల దినం వేదికగా ప్రజలకు అవగాహన కల్పించడం, వన్యప్రాణులను కాపాడే సంస్థలు లేదా వ్యక్తులను గుర్తించడం, ఆర్థిక నిధుల సేకరణ, ప్రభుత్వాల చొరవ, ప్రజల సహకారం, ఎన్జీవోల చొరవ లాంటివి నిర్వహిస్తూనే వన్యప్రాణుల పరిరక్షణ ఆవశ్యకతను వివరించే కార్యశాలలు, సెమినార్లు, ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌-లైన్‌ అవగాహనలు, నిధుల సేకరణ కార్యక్రమాలు, ప్రపంచ దేశాల సమన్యయ సహకారాలు, విజ్ఞాన వితరణలు లాంటివి నిర్వహించడం మంచిది. పర్యావరణ సమతుల్యతకు గొడుగు పట్టడం, జీవవైవిధ్యానికి ఊపిరులూదడం, సహజ అందాలను ఆస్వాదిస్తూ కాపాడుకోవడం లాంటివి నిరంతరం కొనసాగాలి.

జీవవైవిధ్య పరిరక్షణతో ఆహార భద్రత, ఔషధాల లభ్యత, శుద్ధ జలాలు, పీల్చే గాలులు, వాతావరణ సానుకూల మార్పులు సమకూరుతాయి. ఈ ప్రధాన విషయాలను నేటి మనిషి పెడచెవిన పెట్టి విధ్వంసానికి పాలుపడితే రేపటి తరం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, “మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దు” అని గుణపాఠం నేర్చుకోవడంతో పాటు జీవవైవిధ్య దీపాన్ని కాపాడుకుంటూ భూగృహాన్ని లేదా ఇల్లును చక్కదిద్దుకుందాం.

  • డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News