- అమెరికా దాడులు ఉదృతం..
- ఆయుధాలు వీడండి..
- సైన్యానికి హెచ్చరిక పంపిన ట్రంప్..
- తరతరాలుగా రాని చారిత్రక అవకాశం..
ఇరాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇది చారిత్రక అవకాశం, మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ ఇరాన్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్‌లో సైనిక చర్యను ధృవీకరిస్తూ ఆయన 8 నిమిషాల నిడివి గల ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందేశంలో ఇరాన్ భద్రతా దళాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూనే, ప్రజలకు కీలక సూచనలు చేశారు.
ఇరాన్ ప్రజలకు కూడా ట్రంప్ ఒక సందేశం ఇచ్చారు. దాడుల సమయంలో ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. “గర్వించదగ్గ ఇరాన్ ప్రజలారా, మీ స్వేచ్ఛకు సమయం ఆసన్నమైంది. బయట చాలా ప్రమాదకరంగా ఉంది, బాంబులు అన్నిచోట్లా పడతాయి. మేము దాడులు పూర్తి చేశాక, మీ ప్రభుత్వాన్ని మీరే స్వాధీనం చేసుకోండి. అది మీ సొంతం అవుతుంది. తరతరాలుగా బహుశా మీకు లభించే ఏకైక అవకాశం ఇదే” అని ట్రంప్ పేర్కొన్నారు.
చాలా ఏళ్లుగా ఇరాన్‌లోని కొన్ని వర్గాలు అమెరికా సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని, కానీ అది ఎప్పుడూ అందలేదని ట్రంప్ గుర్తుచేశారు. “మీరు ఎన్నో ఏళ్లుగా అమెరికా సహాయం కోరారు. ఇప్పుడు మేం మీకు అండగా నిలుస్తున్నాం. మా అపారమైన, విధ్వంసకర బలంతో మీకు మద్దతిస్తున్నాం. దీనిపై మీరు ఎలా స్పందిస్తారో చూస్తాం” అని ఆయన అన్నారు. తన ప్రసంగాన్ని ముగిస్తూ, “మీ భవిష్యత్తును మీరే నిర్దేశించుకోవడానికి ఇదే సరైన సమయం. వెంటనే రంగంలోకి దిగండి. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు” అని ట్రంప్ పిలుపునిచ్చారు.
