- నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
మొయినాబాద్ మండల పరిధిలోని కాశింబౌళిలో రేయిన్బో క్రికెట్ గ్రౌండ్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హ*త్యకు గురయ్యాడు. శనివారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో కీలక ఆధారాలు సేకరించారు. మృతుడు ఈశ్వర్ (35)గా గుర్తించారు. ఈశ్వర్ గత 20 రోజులుగా జేబీఐటీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడు మొయినాబాద్ సురంగల్‌లో భార్య బోనగిరి మమతా, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. సూర్యపేట జిల్లా తిరుమలగిరి నుంచి ఉపాధి కోసం మొయినాబాద్‌కు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అతని భార్య మమత పల్లవి స్కూల్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
