- తప్పుడు కేసులతో ఇరుకున పడకండి..
- సిట్ అధికారులకు సూచించిన కేసీఆర్..
- దాదాపు 5 గంటలపాటు విచారించిన అధికారులు..
- ఆధారాలను ముందుంచి విచారించిన సిట్..
- విచారణ తతంగాన్ని రికార్డు చేసిన ఆఫీసర్స్..
- విచారణకు ముందు భావోద్వేగానికి గురైన కేసీఆర్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఆధారాలను ముందుంచి కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో సిట్ విచారణకు హాజరైన వారి స్టేట్ మెంట్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో రెండో ఫ్లోర్ లో సిట్ బృందం కేసీఆర్ ను విచారించింది. ఫోన్ ట్యాపింగ్ తో నాకేం సంబంధం అని విచారణ అధికారులతో కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు తప్పుడు కేసులతో ఇరుకున పడొద్దంటూ సిట్ కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు సిట్ అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ ను ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని వీడియో, ఆడియో రూపాల్లో రికార్డ్ చేసుకున్నారు. అధికారులు. చాలా అంశాలకు సంబంధించి కేసీఆర్ నుంచి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు అధికారులు. కాగా అంతకు ముందు అంటే సిట్ విచారణకు ముందు మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది.
తెలంగాణ సాధనకు వ్యూహరచన చేసిన గదిలోనే ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం తనను తీవ్రంగా బాధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “స్వరాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కీలక చర్చలు జరిపాను. అలాంటి చోట ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు” అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. విచారణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నందినగర్ పరిసరాల్లో భారీ బందోబస్తు మోహరించారు. విచారణ ప్రారంభం కాగానే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర నేతలను బయటకు పంపించారు. నిబంధనల ప్రకారం కేసీఆర్ తరఫున న్యాయవాదులను లోపలికి అనుమతించేందుకు సిట్ అధికారులు నిరాకరించారు.
