Friday, February 13, 2026
HomeతెలంగాణToxicity | విషపూరితంగా మారుతున్న హైదరాబాద్

Toxicity | విషపూరితంగా మారుతున్న హైదరాబాద్

  • ప్రమాదకరంగా ఓ.ఆర్.ఆర్ ప్రాంతం
  • భవిష్యత్తులో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్న ఐఐటి కాన్పూర్ అధ్యయనం..

హైదరాబాద్ నగరం విషతుల్యంగా మారిపోతోందా..? భవిష్యత్తులో శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవుతుందా..? అవును అని హెచ్చరిస్తున్నాయి. తాజా అధ్యయనాలు.. మనం పీల్చుకునే గాలిలో విషపూరిత వాయువు ప్రమాదకర స్థాయికి చేరింది.. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలు భయంకరంగా మారిపోతున్నాయి.. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలు కలసి ఇప్పుడు మన ఊపిరిని లక్ష్యంగా చేసుకున్నాయి. దీని ప్రభావం వెంటనే కనిపించదు కానీ ఇకపై శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఆస్థమా, శ్వాసకోశ వ్యాధులు మెల్లగా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీపై ఐఐటి కాన్పూర్ అధ్యయనం చేసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఈ స్టడీ జరిగింది. ఇందులో నగరంలోని గాలి కాలుష్య మూలాలు, వాటి తీవ్రతను శాస్త్రీయంగా విశ్లేషించారు. ఆ అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రోజుకు సగటున 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతోంది.

- Advertisement -

ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 10,701 కిలోల ఎస్ ఓ2 ఉద్గారాలు నమోదయ్యాయి. ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే.. జీ.హెచ్.ఎం.సి. పరిధిలో విడుదలవుతున్న ఎస్.ఓ2లో 91 శాతం వాహనాల నుంచే వస్తోంది. కానీ ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ 92 శాతం కార్బన్ డై ఆక్షైడ్ పరిశ్రమల నుంచే వస్తోంది. అంటే నగర కేంద్రంలో మనం నడిపే వాహనాలే గాలిని విషపూరితం చేస్తుంటే.. నగర అవతల పరిశ్రమలు ఊపిరిని మింగేస్తున్నాయి. సల్ఫర్ డయాక్సెడ్ ఒక సాధారణ కాలుష్య వాయువు కాదు. ఇది ఫాసిల్ ఇంధనాల దహనంతో ఉత్పత్తి అవుతుంది.

ముఖ్యంగా డీజిల్, బొగ్గు వాడకం ఎక్కువైన చోట్ల దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం, ఎస్.ఓ.2 గాలి ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడు శ్వాసనాళాల్లో మంట, ఊపిరితిత్తుల వాపు, ఆస్థమా తీవ్రత పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఇది కేవలం ఆరోగ్య సమస్యగా మాత్రమే మిగలదు. ఈ వాయువు వర్షంతో కలిసినప్పుడు ఆమ్ల వర్షంగా మారుతుంది. దీని వల్ల నేల సారం తగ్గుతుంది. పంటలు దెబ్బతింటాయి. చెట్లు ఎండిపోతాయి. అంటే ఇది నగర ఆరోగ్యాన్నే కాదు.. పరిసరాల జీవనవ్యవస్థనే దెబ్బతీసే ముప్పు. దీని నివారణకు తెలంగాణ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News