Thursday, June 18, 2026
Homeభక్తిAkshaya Patra | అక్షయపాత్ర గురించి తెలుసుకోండి..

Akshaya Patra | అక్షయపాత్ర గురించి తెలుసుకోండి..

  • క్షయము అంటే అంతమయ్యేదని అర్ధం..
  • అక్షయము అంటే ఎన్నటికీ నాశనం కానిది అని అర్ధం..

పాండవులు జూదంలో ఓడిపోయి, అరణ్యవాసం చేస్తున్న సమయమది. ధర్మరాజు వెంట ఎంతోమంది అడవికి వచ్చారు. వారిలో బంధువులు, మహర్షులు, పురోహితులు కూడా ఉన్నారు. రాజ్యాన్ని వీడిన ఆ స్థితిలో తన వెంట వచ్చిన వారందరికీ నిత్యం భోజనం ఎలా పెట్టాలో ధర్మరాజుకు అర్థం కాలేదు. ఆ వేదనతోనే సూర్యుడిని ప్రార్థించాడు. తనకు దారి చూపించాలని వేడుకున్నాడు. ధర్మరాజు భక్తికి మెచ్చిన సూర్యభగవానుడు ఒక మహిమాన్వితమైన పాత్రను ప్రసాదించారు. అదే అక్షయ పాత్ర. క్షయము అంటే అంతమయ్యేదని అర్థం.

అక్షయము అంటే ఎన్నటికీ నాశనం కానిది అని అర్థం. సూర్యుడు ప్రసాదించిన ఆ పాత్రను తన ఇల్లాలు ద్రౌపదికి అందించాడు ధర్మరాజు. ఆ పాత్ర ప్రత్యేకత ఏంటంటే.. ద్రౌపది అందరికీ అన్నం పెట్టి, చివరగా తాను భోజనం చేసేంతవరకు అందులో ఆహారం లభిస్తూనే ఉంటుంది. ఆమె తిని పాత్రను కడిగి బోర్లించిన తర్వాత, ఇక ఆ రోజుకు అందులో ఆహారం రాదు. ఒకరోజు పాండవులు, వెంట వచ్చిన వారంతా భోజనాలు ముగించారు.

- Advertisement -

ఇక ఎవరూ రారు అనుకుని ద్రౌపది కూడా భోజనం చేసి, అక్షయ పాత్రను శుభ్రంగా కడిగి బోర్లించి పెట్టింది. అయితే, పాండవులను పరీక్షించడానికో లేదా దైవసంకల్పం వల్లనో తెలియదుగానీ దుర్వాస మహర్షి తన వందలాది మంది శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. వారు నదీ స్నానానికి వెళ్తూ, రాగానే తమకు భోజనం సిద్ధం చేయమని చెప్పి వెళ్లారు. దీంతో ద్రౌపది తీవ్ర ఆందోళనకు గురైంది. అక్షయ పాత్ర కడిగేసింది కాబట్టి, ఇక ఆ రోజుకు అందులో ఆహారం రాదు. ఆ సమయంలో ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. మహర్షి ఆగ్రహానికి గురైతే శాపం ఇస్తారని భయపడి, మనసారా శ్రీకృష్ణుడిని ప్రార్థించింది.

వెంటనే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్షయ పాత్ర తీసుకురమ్మని ద్రౌపదికి చెప్పాడు. ఆ పాత్ర కడిగేశాను, అందులో ఏమీ లేదు అని చెప్పింది. అయినప్పటికీ తీసుకురమ్మని కృష్ణుడు చెప్పాడు. ద్రౌపది ఆ పాత్రను తెచ్చిన తెచ్చిన తర్వాత, దాన్ని పరీక్షించి, అంచున ఎక్కడో అంటుకుని ఉన్న ఒక్క అన్నం మెతుకును కనుగొన్నాడు.

ఆ ఒక్క మెతుకును తన నోట్లో వేసుకుని తిన్నాడు. పరమాత్ముడైన కృష్ణుడు ఆ ఒక్క మెతుకుతో సంతృప్తి చెందడంతో, విశ్వంలోని సమస్త జీవులతో పాటు, నదీ స్నానానికి వెళ్లిన దుర్వాస మహర్షికి, ఆయన శిష్యులకు కూడా కడుపు నిండిపోయి, త్రేన్పులు వచ్చాయి. వారు ఇక భోజనం చేయలేని పరిస్థితికి వచ్చేశారు. దాంతో వారు అక్కడి నుంచి అటే వెనుతిరిగి వెళ్ళిపోయారు.

ఈ కథ ద్వారా ఇల్లాలి ప్రాధాన్యతను లోకానికి చాటారని ఆధ్యాత్మిక ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి తెలిపారు. సనాతన ధర్మంలో గృహిణిని అన్నపూర్ణగా భావిస్తారు. ఇంట్లో ఏ పదార్థం వండినా ఇల్లాలు తాను ముందుగా తినకుండా ఇతరులకు పెట్టాలి. అదేవిధంగా, రాత్రి పూట అందరూ భోజనం చేసిన తర్వాత, ఇల్లాలు తినే సమయంలో గిన్నెలోని అన్నం పూర్తిగా ఖాళీ చేయకూడదట.

కనీసం ఒక ముద్ద ఆహారాన్నైనా చిన్న పాత్రలో దాచి మూతపెట్టాలట. అప్పుడే ఆ ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందుతాయట. అలా మిగిల్చిన ఆహారాన్ని మరుసటి రోజు ఉదయం మూగజీవులకు, క్రిమికీటకాలకు పెట్టడం వల్ల సమస్త జీవకోటికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. మహిళ కేవలం ఇల్లాలు మాత్రమే కాదని, సమస్త జీవకోటిని పోషించే శక్తి స్వరూపిణిగా ఈ కథ మనకు బోధిస్తుందని సూర్యనారాయణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News