Friday, February 27, 2026
Homeమెదక్‌SIT | సిట్ పద్ధతి సరిగా లేదు: కేసీఆర్

SIT | సిట్ పద్ధతి సరిగా లేదు: కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) విచారణకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) తన పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని మాజీ సీఎం(Former CM), బీఆర్ఎస్ పార్టీ అధినేత(BRS Party Chief) కేసీఆర్(KCR) శనివారం తీవ్ర అభ్యంతరం(Objection) తెలిపారు. సిట్ ఆఫీసర్లు నంది నగర్‌లోని తన నివాసం గోడలకు నోటీసులు అంటించడమేంటని నిలదీశారు. దీనిపై జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరికి లెటర్(letter to acp) రాశారు. చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ తాను సిట్ విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉంటానని తెలిపారు.

ఇంటి గోడలకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదని కేసీఆర్‌ తప్పుపట్టారు. సిట్‌ పోలీసుల వైఖరి న్యాయస్థాన ధిక్కారం కిందకే వస్తుందని అన్నారు. పోలీసుల తీరు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉందని, ఏసీపీ వెంకటగిరికి తనను విచారించే అధికార పరిధి లేదని తేల్చిచెప్పారు. బాధ్యత కలిగిన పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని ప్రకటించారు.

- Advertisement -

సిట్(SIT) అధికారుల నోటీసులపై కేసీఆర్ స్పందనలోని ముఖ్యాంశాలు

‘సిట్ అధికారుల తీరు చట్టాలకు వ్యతిరేకం. సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కారు. నాకు నోటీసు ఇచ్చే అధికారమే వారికి లేదు. ఇది నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. రెండు సార్లు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధం. చట్టాలను అతిక్రమించి ఇచ్చారు. తొలి నోటీసుకు మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటం వల్ల వేరే తేదీ ఇవ్వాలని కోరాను. దీంతోపాటు.. 65 ఏళ్ల పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటే విచారించాలని సెక్షన్ 160 CrPC నిబంధనలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చాను. తదుపరి నోటీసులన్నీ ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పాను.

అయితే.. ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు అధికారుల సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నందినగర్ నివాసంలోని ఇంటి గోడకు అతికించినట్లు తెలుస్తోంది. ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇది.. రాజ్యాంగం, చట్టం, గౌరవ సుప్రీంకోర్టు పట్ల అధికారులకు ఏమాత్రం గౌరవం లేదనే విషయాన్ని సూచిస్తోంది. గతంలో సుప్రీంకోర్టు సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదు. చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలి.

CrPC 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాల్సి ఉన్నా.. కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. భవిష్యత్ నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని చెప్పినా కూడా విస్మరించారు. రెండో నోటీసు చట్టబద్ధంగా అందలేదు. అది చెల్లదు. నేను సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండట్లేదు. కాబట్టి నోటీసు ఇచ్చే అధికార పరిధి అధికారులకు లేదు. ఎలక్షన్ అఫిడవిట్ లేదా అసెంబ్లీ రికార్డులను సాకుగా చూపి ఎర్రవల్లిలో విచారించలేమని చెప్పడం సరికాదు.

నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారన్నదే ముఖ్యం. హరీష్ రావు విషయంలో ఒకలా, నా విషయంలో మరోలా వ్యవహరించడం అధికారుల ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తోంది. అయితే.. చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నా మాజీ సీఎంగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నా. అధికారులు నందినగర్ నివాసంలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పట్టుబట్టినందున రేపు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడే అందుబాటులో ఉంటా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News