Friday, February 27, 2026
Homeఆరోగ్యంMedaram | జాతరలో ఉచిత ఆయుష్ వైద్య సేవలు

Medaram | జాతరలో ఉచిత ఆయుష్ వైద్య సేవలు

ఉచిత చికిత్స పొందిన 6 వేల మందికి పైగా భక్తులు
దుష్ప్రభావాలు లేని సంప్రదాయ వైద్యంపై పెరుగుతున్న నమ్మకం

సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) మేడారం మహా జాతర(Maha Jatara)కు హాజరయ్యే భక్తుల(Devotees) కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆయుష్ వైద్య శిబిరాన్ని(Ayush Medical Camp) ఏర్పాటుచేసింది. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులో ఉంచింది. దీని ద్వారా ఇప్పటివరకు 6 వేల మందికి పైగా యాత్రికులు ఉచిత వైద్య చికిత్స పొందారు.

- Advertisement -

జాతర ప్రారంభం కన్నా ముందే ఈ నెల 6న ప్రారంభించిన ఈ శిబిరానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీన్నిబట్టి సంప్రదాయ వైద్య (Traditional Medicine) విధానాలపై భక్తుల్లో అవగాహన పెరుగుతున్నట్లు చెప్పొచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న యాత్రికులకు ఈ శిబిరం సేవలు అందిస్తోంది.

జాతర సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడం, ఎక్కువసేపు నడవడం వల్ల వచ్చే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతోపాటు జలుబు, దగ్గు, సాధారణ అలసటకు చాలా మంది భక్తులు చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయుష్ చికిత్స ప్రభావవంతంగా పనిచేస్తుండటం, దుష్ప్రభావాలు లేకపోవడం వల్ల యాత్రికులు ఎక్కువగా దీన్ని ఎంచుకుంటున్నారు. గతంతో పోల్చితే ఆయుష్ వైద్యంపై ప్రజల విశ్వాసం గణనీయంగా పెరిగిందని వైద్యాధికారులు చెప్పారు.

డిమాండ్‌ను తీర్చడానికి ఈ ఆయుష్ వైద్య శిబిరంలో 25 నుంచి 30 మంది సహాయక సిబ్బందిని, ముగ్గురు ఆయుష్ వైద్యులను, ఫార్మసిస్ట్‌లను షిఫ్టుల వారీగా నియమించి నిరంతర సేవలు అందిస్తున్నారు. మందులు కొరత లేకుండా చూస్తున్నారు. ఈ మేరకు అన్ని ముఖ్యమైన ఆయుష్ మందులను ముందుగానే కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంప్రదాయ ఆరోగ్య సంరక్షణను యాత్రికులకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ ఆయుష్ వైద్య శిబిరం.. మేడారం మహా జాతర సమయంలో భక్తుల ఆరోగ్యం, శ్రేయస్సుకు ఎంతగానో పాటుపడుతోంది. సేవల నాణ్యత, ప్రభావం పట్ల యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News