Thursday, February 12, 2026
Homeసాహిత్యంNational Tourism Day | ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష

National Tourism Day | ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష

అవి.. భక్త కరీంనగర్ జిల్లా గత కీర్తికి, ప్రాచీన చరిత్ర(History)కు నిలువుటద్దంగా ఉన్నాయి. రాష్ట్ర పురావస్తు శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ వి.వి.కృష్ణశాస్త్రి అపురూప పరిశోధనల ఫలితంగా జిల్లా పాక్చరిత్ర 50 వేల ఏళ్లకు పూర్వం ఉందని రుజువైంది. ఇది సామాన్య విషయం కాదు. గౌతమి నది దక్షిణ తీరంలో పరివ్యాప్తమై ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉత్తర దక్షిణ భారతీయులకు సేతువై నిలిచిన ఈ ప్రాంత నాగరికత కాల ప్రవాహంలో కొట్టుకొనిపోయినా ఉత్సాహవంతులైన చరిత్ర పరిశోధకుల అవిరళ కృషి ఫలితంగా కథలుగా, గాథలుగా, నోళ్లలో, రాళ్లలో, ఆకుల్లో, రేకుల్లో అక్కడక్కడ నిక్షిప్తమై ఉన్న చరిత్ర కొంతవరకు వెలుగులోకి వచ్చింది.

చరిత్రలో ఆంధ్రుల(Andhra)కు లభించిన సమాచారం మేరకు.. శాతవాహనులది మొట్టమొదటి రాజవంశం అనీ, అది మహారాష్ట్రలోని పైఠానో లేక నాసిక ప్రాంతం అనుకుంటే కాదని, అంతకుముందే పురాణాల్లో పేర్కొన్న ఆంధ్ర భృత్యులని, తొలి ఆంధ్ర ప్రభువుల సేవకులనే విషయం కోటిలింగాల తవ్వకాల్లో బయటపడటం విశేషం. కరీంనగర్ జిల్లా శాతవాహనుల (Shatavahana) మూలపురుషులకు ఆవాస స్థానమని చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. క్రీస్తు పూర్వం శతాబ్దాల క్రితమే ఆంధ్ర రాజ్యం, శాతవాహనుల ఏలుబడిలో వర్ధిల్లిన, వారి అభిమాన పాత్రమైన బౌద్ధమతం, ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య మతమై విరాజిల్లింది.

- Advertisement -

ప్రాచీనమైన ప్రతి గ్రామం పేరులో ప్రతి నిర్మాణ కౌశలంలో, ప్రతి కట్టడంలో వస్తువులు, మట్టి పాత్రలు, మతంతో పెనవేసుకున్న చరిత్ర పలుకుతుంది. శాతవాహన చక్రవర్తుల చత్రచ్చాయల్లో, బౌద్ధ మతం విస్తరించి, శాంతి అహింసలు, విశ్రమించిన ఈ ప్రాంతాల్లో, నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, తవ్విన చోటల్లా దర్శనమిస్తూ, వెలకట్టలేని వేల ఏళ్ల చరిత్రకు మౌన సాక్షీభూతాలుగా నిరాదరణ నీడలో మగ్గుతూ తమ దుస్థితికి చింతిస్తూ అనాసక్తులైన అధికారుల, ప్రజాప్రతినిధుల అశ్రద్ధ, నిర్లక్ష్యానికి కుంగి కృశిస్తూ ఆయువు తీరకముందే అస్తమిస్తున్నాయి.

నిన్నటి వరకు ఆలనాపాలనా కరువై “బుద్ధం(Buddham) శరణం గచ్చామి” అంటూ దీనంగా విలపించిన ధర్మపురి(Dhamapuri) నియోజకవర్గంలోని పాషాయిగాం బౌద్ధ స్తూపం ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నేలమట్టమైంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతాల్లో బౌద్ధ మతవ్యాప్తి జరిగినా అశోకుడి కాలం కన్నా ముందే ప్రవేశించిన బౌద్ధ మతం.. శాత వాహనుల హయాంలో విశేష ఆదరణ పొందింది. అవిభక్త కరీంనగర్ జిల్లాలో 3 ప్రాచీన బౌద్ధ కేంద్రాలు ఉండేవి. వాటిలోని ధర్మపురి సమీప క్రీస్తు పూర్వం 200 ఏళ్ల సంబంధిత పాశాయిగాం బౌద్ధ స్థూపానికి విశేష ప్రాధాన్యత ఉండేది.

దీనికి 6 వృత్తాకార పలకలు ఉండేవి. వీటిపై ఒక పద్మం, ఏనుగు బొమ్మలు, స్థూపానికి ఇరువైపులా స్తంభాకృతులు కలిగి ఉన్న ఆ స్తూపం 2వ శతాబ్దానికి చెందిందిగా దూళికట్ట స్థూపం కన్నా ప్రాచీనమైందిగా, జిల్లాలోని మొట్టమొదటి రాతి కట్టడంగా చరిత్రకారులు రుజువుపరిచారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాగ సింపీయకాయ, జమజో రాగ బ్రహ్మ లేఖలు, స్తూపం వద్ద లభించాయి. శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాలకు 3 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుత రాయపట్నం-కరీంనగర్ రాష్ట్ర రహదారిని ఆనుకొని పాశాయిగాం గుట్టపై చెన్నపూస అనే ఆచార్యుడు, బౌద్ధ స్థూపాన్ని నిర్మించినట్లు, సుప్రసిద్ధ బౌద్ధ ఆచార్యుడు దిజ్ఞాగుడు, ఈ ప్రాంతంవాడేనని, చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ 7వ శతాబ్దంలో తన గ్రంథంలో పేర్కొన్నాడు.

రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ వి.వి.కృష్ణశాస్త్రి శాతవాహన కళా ఉత్సవాల సందర్భంగా 2002 జనవరి 21న కరీంనగర్‌లో ప్రధాన ప్రాసంగకుడిగా ప్రకటించడాన్ని బట్టి పాషాయిగాం బౌద్ధ స్తూప ప్రాధాన్యత స్పష్టమౌతోంది. ఇంతటి ప్రాచీన చారిత్రక ఆధారమైన బౌద్ధ స్తూపం రాష్ట్ర రహదారి రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టరైన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిర్లక్ష్యానికి అనవసరంగా, అకారణంగా బలైంది. 1999 డిసెంబర్ 25న నేలకూలింది. ఆ తర్వాత ముక్కలైన ఆ స్తూప పలకలను చేర్చి జిల్లా కేంద్ర పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరిచి తిరిగి స్థాపించారు.

తత్ఫలితంగా పాశాయిగాంకు చెందిన బౌద్ధ స్తూపం కనుమరుగై ఈ ప్రాంతం చరిత్ర పుటల నుంచి తొలిగిపోయింది. ప్రాచీనత్వాన్ని కోల్పోయింది. అలాగే.. జూలపల్లి మండలంలోని క్రీస్తు పూర్వం 2వ శతాబ్ధికి చెందిన హుస్సే నియా వాగు-చిన్న వాగుల సంగమ స్థానంలో 47 శిల్పాలంకృత పలకలతో శోభితమై 5 పడగల ముచిలింద నాగం బోధి వృక్షం మహాభినిష్క్రమణం చెక్కబడిన దూళికట్ట స్థూపం విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. కాలచక్ర నిర్వహణ కోసం దూళికట్ట నుంచి అపురూప ఫలకాలను, అమరావతికి కొద్దికాలం కిందట అవిభక్త రాష్ట్రంలో తరలించారు.

కోటిలింగాల ధూళికట్ట, మీర్జంపేట మానేరు తీరాన చారిత్రక శిల్పాలను, స్తూపాలను, కోటలను, పరిరక్షించేందుకు నాటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 38 లక్షలకు పైగా నిధులు అర్ధాంతరంగా దారిమళ్లాయి. ప్రాచీన కట్టడాలు, బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, శిల్పీకరించిన అపురూప కళాకృతులు, ఈనాటివారికి ప్రధానంగా చరిత్ర అంటే గౌరవంలేని సరైన అవగాహనలేని, పాలక అధికార వర్గాలకు తెలియకపోవచ్చు.

కానీ.. వాటి ప్రాశస్త్యానికి, వేల ఏళ్ల వెలకట్టలేని చారిత్రక నేపథ్యం ఉందన్న యథార్థాన్ని విస్మరించరాదు. ఒకవైపు ప్రాచీన బౌద్ధవ్యాప్తికి సంబంధించిన ఈ ప్రాంత చరిత్ర మరుగునపడుతుండగా మరోవైపు ప్రాచీనత్వానికి ఆనవాళ్లు అయిన అపురూప చారిత్రక సాక్ష్యాలను కనుమరుగుచేస్తుంటే వారి ఆత్మఘోష వినిపిస్తుంటే భారతీయ పురాతత్వ విభాగం ప్రపంచ పౌరుల ముందు తలదించుకోవాల్సిన దుస్థితి. గొప్పలు చెప్పుకోవడం కాదు. గొప్పలు నిలబెట్టుకోవడమే గొప్పతనం.

(జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా)

  • రామకిష్టయ్య సంగనభట్ల
- Advertisement -
RELATED ARTICLES

Latest News