Thursday, February 12, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంAdmissions | ముందస్తు అడ్మిషన్ల పేరుతో కార్పొరేట్ దందా!

Admissions | ముందస్తు అడ్మిషన్ల పేరుతో కార్పొరేట్ దందా!

పరీక్షలు ముగియకముందే ఇంటర్ అడ్మిషన్ల హడావుడి
నిబంధనలు గాలికొదిలేసిన కాలేజీలు!
ప్రేక్షక పాత్రలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు
గ్రామీణ పాఠశాలలే లక్ష్యంగా పీఆర్వోలు, ఏజెంట్లు
విద్యార్థుల డేటా సేకరణ, తల్లిదండ్రులకు కాల్స్
బాధ్యులైన అధికారులపై తక్షణమే వేటు వేయాలి
డిమాండ్ చేసిన సీజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఇంకా ముగియకముందే కార్పొరేట్ విద్యా సంస్థలు(Corporate Educational Institutions) ఇంటర్మీడియట్ అడ్మిషన్ల(Intermediate Admissions) వేటను ముమ్మరం చేయడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇంటర్ బోర్డు స్పష్టమైన నిబంధనలు, గడువులు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కుతూ ముందస్తు అడ్మిషన్లు, భారీ ఫీజులు, మాయమాటలతో తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారన్న ఆరోపణలు విద్యా వర్గాల్లో వినిపిస్తున్నాయి.

- Advertisement -

పల్లెలే టార్గెట్.. పీఆర్వోల వేట..

కార్పొరేట్ కళాశాలలు ప్రచారానికి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలే లక్ష్యంగా పీఆర్వోలు రంగంలోకి దిగారు. అక్కడి ఉపాధ్యాయులతో పరిచయాలు పెంచుకొని విద్యార్థుల డేటాను సేకరిస్తున్నారు. ఫోన్ నంబర్లు సంపాదించి (Phone Numbers Collections) నిత్యం కాల్స్‌తో వేధిస్తున్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉన్నట్లుగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలు(AI and Fake Videos), ఆడియోలతో తల్లిదండ్రులను భ్రమింపజేస్తున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు(Doctors And Engineers) చేస్తామంటూ నకిలీ ర్యాంకుల బోర్డులతో విద్యార్థులను ఆకర్షిస్తున్నారు.

లక్షల్లో ఫీజులు.. హెర్డింగుల జోరు..

నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్ వెంబడి భారీ హోర్డింగులు, బ్యానర్లతో ప్రచారం హెూరెత్తిస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి ఎంపీసీ, బైపీసీ కోర్సుల పేరుతో రూ.1.80 లక్షల నుంచి రూ.2.80 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 25 తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ.. ఏ నిబంధనలూ తమకు వర్తించవన్నట్లుగా జనవరి నుంచే అడ్మిషన్ల దందా మొదలుపెట్టారు.

బోర్డు అధికారుల అండదండలు?..

ఇంటర్ బోర్డు సెక్రటరీ, జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టాల్సి ఉండగా వారు కార్పొరేట్ యాజమాన్యాలతో చేతులు కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం అనుమతులులేని కాలేజీల కార్యక్రమాలకు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరుకావడం వారి మధ్య ఉన్న అపవిత్ర బంధానికి నిదర్శనమని విద్యావేత్తలు మండిపడుతున్నారు.

ప్రధాన డిమాండ్లు..

అక్రమంగా అడ్మిషన్లు జరుపుతున్న కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి. డేటా విక్రయానికి పాల్పడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ పర్యవేక్షణలో మాత్రమే అడ్మిషన్ల ప్రక్రియ సాగేలా చూడాలి. అలాగే దీనిపై ప్రభుత్వం, విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

నిబంధనలకు విరుద్ధం..

‘ముందస్తు అడ్మిషన్లు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. రూల్ 14(6) ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలకు లక్ష రూపాయల జరిమానాతోపాటు వాటి గుర్తింపును రద్దు చేయాలి. బాధ్యులైన అధికారులపై తక్షణమే వేటు వేయాలి’ అని సీజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News