- 2,805 డాలర్ల నుంచి 2,965కి హైక్
- మార్చ్ 1 నుంచి అమల్లోకి.. పలు వీసా కేటగిరీల్లోనూ మార్పులు..
- విద్యార్థులు, వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం
- అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం
అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచినట్టు పౌరసత్వ, వలస సేవల శాఖ తాజాగా వెల్లడిరచింది. కొత్త రేట్స్ మార్చ్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. హెచ్1బీ, ఎల్1 సహా పలు రకాల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసేందుకు అమెరికా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును చార్జ్ చేస్తుంటుంది. హెచ్1బీ లాంటి వీసాల విషయంలో గతంలో 2,805 డాలర్లుగా ఉన్న ప్రీమియం ఫీజు ప్రస్తుతం 2,965కి పెరిగింది. విదేశీ ఉద్యోగుల వీసా దరఖాస్తు పరిశీలనను వేగవంతం చేసేందుకు అమెరికా సంస్థలు ఈ ఫీజును చెల్లిస్తుంటాయి. ఇక ఎఫ్1, జే`1వంటి వీసాల ప్రీమియం ఫీజు కూడా 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచినట్టు పౌరసత్వ, వలస సేవల శాఖ పేర్కొంది.
జాబ్స్ మారే వారు, వీసాలను రెన్యూవల్ చేసుకునే విదేశస్తులపై ఈ పెంపు భారం పడనుంది. ఫీజు పెంపుతో వచ్చే అదనపు నిధులతో తమ కార్యకలాపాలను మరింత సరళతరం చేసేందుకు వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. వీసా దరఖాస్తుల బ్యాక్‌లాగ్స్ తగ్గడంతో పాటు వీసా దరఖాస్తుల పరిశీలన ఇతర సేవలు మరింత వేగవంతం అవుతాయని చెప్పింది. వీసా సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ధరలు సరిదిద్దడమే తమ లక్ష్యమని కూడా వెల్లడిరచింది. వలసల కట్టడికి ఇప్పటికే అమెరికా ప్రభుత్వం వివిధ మార్గాలను అనుసరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే చిక్కులు తప్పవని ఇటీవల భారతీయ ఎంబసీ ఎక్స్ వేదికగా హెచ్చరించిన విషయం తెలిసిందే.
