‘అభినవ్ బింద్రా’ నివేదిక సమర్పణ
అభినవ్ బింద్రా(Abhinav Bindra) నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ మన దేశ క్రీడా పరిపాలనలోని వ్యవస్థాగత లోటుపాట్లను పట్టిచూపింది. 170 పేజీల నివేదికను కేంద్ర క్రీడల శాఖ మంత్రి(Union Minister For Sports) మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)కు సమర్పించారు. దీనిపై స్పందించిన ఆయన.. సంబంధిత సిఫారసులన్నీ అమలు చేస్తామని మంగళవారం వెల్లడించారు. 9 మంది సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఆగస్టులో ఏర్పాటుచేసింది. గత ఐదు నెలలుగా అధ్యయనం చేసిన ఈ టాస్క్‌ఫోర్స్.. ప్రభుత్వానికి పలు సూచనలు సలహాలు ఇచ్చింది.
ప్రత్యేక కేడర్‌కు శిక్షణ ఇవ్వడానికి ఐఏఎస్ అధికారులతో కూడిన స్వయంప్రతిపత్తి గల చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటుచేయాలని సిఫారసు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI), నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్(NSFs), రాష్ట్ర విభాగాల్లోని లోపాలను పరిష్కరించడానికి, క్రీడా పరిపాలన, శిక్షణను నియంత్రించడానికి, గుర్తింపు ఇవ్వడానికి, ధృవీకరించడానికి మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్(NCSECB)ని ఏర్పాటుచేయాలని సూచించింది.
