శ్రీఅయ్యప్పస్వామి వారి అవతారంలో సృష్టి రహస్యం దాగి ఉంది. అత్రి మహర్షి, అనసూయ దంపతుల కుమారుడు దత్తాత్రేయుడు. లక్ష్మీ, సరస్వతి, పార్వతుల అంశతో జన్మించిన స్త్రీ.. లీలావతి. దత్తాత్రేయుడు, లీలావతి వివాహం జరిగింది. కొంతకాలం దాంపత్య జీవనం గడిపారు. అవతార పరమార్థం నెరవేరాక దత్తాత్రేయావతారం ముగించాలని దత్తుడు అన్నాడు. కానీ.. తనకు ఇహలోకపు సౌఖ్యాలు కావాలని లీలావతి అన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన దత్తాత్రేయుడు ఆమెను మహిషిగా జన్మించమని శపిస్తే ఆమె కూడా అలానే ప్రతిశాపమిచ్చింది. లీలావతి మనిషిగా జన్మించింది. మహిషి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. అంతేకాదు. బ్రహ్మదేవుడి కోసం మహిషి ఘోర తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే విష్ణువుకు శివుడికి పుట్టే బిడ్డ ద్వారా మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇవ్వమని కోరింది. బ్రహ్మ.. వరం ప్రసాదించాడు.
వర గర్వంతో మహిషి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. మహిషి ధాటికి దేవలోకం గడగడలాడ సాగింది. దేవతలందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. చివరకు దత్తాత్రేయుడిని అందమైన మహిషంగా మార్చారు. ఆ మహిషం మహిషి కంటపడింది. ఆకర్షితురాలైన మహిషిలో మదనతాపం మొదలైంది. దీంతో మహిషి మహిశం పన్నెండు సంవత్సరాల పాటు పంపా తీరంలో కామకేళి కార్యంలో ఉండగా ఒక బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడే అయ్యప్ప. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ‘హరిహర సుతుడు’ అని నామకరణం చేశాడు. మోహినీ రూపం చాలించిన శ్రీమహావిష్ణువు ఆ బాలుడి మెడలో ఒక మణిహారాన్ని వేశాడు. అందుకే ఆ బాలునికి ‘మణికంఠుడు’ అనే పేరు కూడా వచ్చింది.
కేరళ(Kerala)లోని పందళ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే రాజు రాజశేఖర పాండ్యునికి సంతానం లేదు. ఒకరోజు వేటకు అడవికి వెళ్లాడు. అక్కడ రాజుకు మెడలో మెరుస్తూ ఉన్న మణిని ధరించిన బాలుడైన మణికంఠుడు కనిపించాడు. ఈ బాలుడిని పుత్రుడిగా స్వీకరించు. అతని వల్ల నీ వంశం వర్ధిల్లుతుంది అనే మాటలు వినిపించాయి. దీంతో రాజు ఆ బాలుడిని రాజ్యానికి తీసుకొనిపోయి కొడుకుగా స్వీకరించి అల్లారు ముద్దుగా చూసుకో సాగారు. కొన్ని రోజులకు రాజశేఖరుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడికి రాజరాజన్ అని పేరు పెట్టారు. మణికంఠుడికి పన్నెండేళ్ల వయసు రాగానే అతనికి యువరాజుగా పట్టాభిషేకం జరపాలని నిర్ణయించారు. సొంత కుమారుడు రాజు కావాలని కాంక్షించిన రాణి.. మంత్రితో కలిసి మణికంఠుడిని అంతమొందించేందుకు ఎన్నో ఎత్తులు వేసింది. అన్నీ విఫలం కావడంతో రాణి దొంగ తలనొప్పి నటించింది.
పులి పాలు తెస్తే గానీ తలనొప్పి తగ్గదని రాణి రాజవైద్యుడితో చెప్పించింది. చివరకు మణికంఠుడు అందుకు సిద్ధమయ్యాడు. తలపై పూజాద్రవ్యాలను ఒక ముడిలోనూ, ఆహారపదార్థాలను మరొక ముడిలోనూ కట్టుకొని ఆ మూటను తలపై పెట్టుకొని పులిపాల కోసం అడవికి బయలు దేరాడు.
ఈలోగా మహిషం మాయలో పడిన మహిషి కళ్లు తెరిచి దేవతలపై కోపించి మళ్లీ విజృంభించింది. అడవికి వెళ్తున్న మణికంఠుడు మహిషిపై దాడి చేసి పీక నులిమి వదిలేశాడు. ఆ మహిషి అళదామేడు పర్వతంగా మారి క్షణక్షణానికి పెరగసాగింది. దానిపై పెద్దబండ వేసి నాట్యం చేసి మహిషిని పూర్తిగా అంతమొందింపజేసి సకల లోక వాసులను రక్షించాడు. ఈ సమయంలో దేవతలందరూ పులి రూపాలను ధరించి ప్రత్యక్షం కాగా ఇంద్రుడు పెద్ద పులిగా మారగా ఆ పులిమీదే సవారీ చేస్తూ మణికంఠుడు పందళరాజ్యానికి చేరాడు. దీంతో అందరూ మణికంఠుడిని దైవాంశ సంభూతుడిగా గుర్తించి ప్రార్థించారు.
శ్రీఅయ్యప్పస్వామి పూజా పద్ధతి ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన వైష్ణవ శైవమత అద్భుత సమ్మేళనం. హరిహరుల కుమారుడిగా శ్రీఅయ్యప్పస్వామి వైష్ణవ శైవ భక్తులకాశ్రయమిచ్చు దేవరయని వారి నమ్మకం చూరగొన్న పరమ పవిత్రమూర్తి, అతిలోక సౌందర్య వాహిని, మోహినీ రూప శ్రీహరి పరమశివుని కలయికతో శ్రీఅయ్యప్పస్వామి జననం సర్వలోక పూజ్యమైంది.
పవిత్ర పంపా నదీ తీరాన బాలుడిగా ఉన్న శ్రీఅయ్యప్పను అనపత్యు డైన పాతాళరాజు చూచి ఇంటికి తెచ్చుకొని పెంచుకొన్నాడు. అమూల్య మణి కంఠాభరణం ఉన్న ఈ బాలుడు మణికంఠనామంతో ప్రసిద్ధుడాయెను. కాలక్రమంలో రాణి ప్రసవించి కుమారుణ్ని కన్నారు. ఇద్దరూ దినదిన ప్రవర్ధమానంగా పెరిగారు. తదుపరి కొంత కాలానికు ఈ ఇద్దరిలో రాజ్యాధికారానికి వారసుడి ఎంపికలో సందిగ్ధం తలెత్తింది. రాణి తన కుమారుడికే రాజ్యం అప్పగించాలని, ఉత్తరాధికారిని చేయాలని సంకల్పించారు. తన దుష్ట మంత్రాంగంతో మణికంఠుణ్ని అనేక కష్టాల పాలు జేశారు. రోగగ్రస్తురాలి మాదిరిగా నటించారు. ఔషధంగా మణికంఠుణ్ని.. పులిపాలు తేవాలని కోరారు.
దేవతల అభీష్టం మేరకు సంకట కారకుడైన మహిషాసురుణ్ని సంహరించటానికి మణికంఠుణ్ని సమాయత్తపరచటానికి ఈ పరీక్ష జరింది. మహిషాసురుణ్ని సంహరించి పులి వాహనుడిగా మణికంఠుడు గృహానికి అరుదెంచి అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో తేలియాడేలా చేశాడు.
దీంతో.. మహిమాన్వితుడైన మణికంఠుడే రాజ్యార్హుడని నిర్ణయించి రాజ్యాన్ని మణికంఠుడికి అప్పజెప్పాలని నిర్ణయించారు. కానీ.. మణికంఠుడు దానికి అంగీకరించలేదు. తన శేష జీవితాన్ని తపస్సులో గడపటానికి నిర్ణయించుకున్నాడు. పాతాళ రాజు అద్భుత దేవాలయాన్ని శబరి కొండల మధ్య నిర్మించి ఇచ్చాడు. అదే నేడు శబరిమలలో వెలసిన శ్రీఅయ్యప్పస్వామి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది.
నేడు భక్తులు సాంప్రదాయంగా ఉన్న ఎరుమెలి దారి గుండా శబరిమలకు ప్రయాణం చేస్తున్నారు. స్వామిని చేరుకోవటానికి కొండ దారి నిటారుగా ఉండి జారుడు స్వభావం కలిగి చాలా కష్టంగా ఉంది. అయినా.. భక్త జన సందోహం మహెూత్సాహంతో శ్రీఅయ్యప్ప దేవాలయం చుట్టూ ఉన్న దట్టమైన అడవిని, క్రూర జంతు సందోహాన్నీ లెక్కచేయకుండా ఏటా మిక్కిలిగా స్వామి దర్శనం కోసం వస్తున్నారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో జరిగే మండల పూజ, మకర విలక్కు విశు, చైత్ర ప్రథమ దినంలో భక్తులు స్వామిని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో వస్తున్నారు. మకర జ్యోతిని దర్శించుకోవటాన్ని మహద్భాగ్యంగా పరిగణిస్తున్నారు.
శబరిమల యాత్ర చేసే భక్తులు నవంబర్‌లో 41 రోజులు వ్రత దీక్షతో తులసి మాల (శబరిమలను దర్శించిన స్వామి ఆశీర్వచనాలతో) ధరించి కటిక నేలపై పడుకోవటం, మాంసాహారం తినకపోవటం తదితర నియమాలతో కఠోర వ్రత దీక్ష చేస్తున్నారు. ఇవి.. భక్తులను స్వాములుగా తీర్చిదిద్ది మానసికంగా, శారీరకంగా శబరియాత్ర చేయటానికి సమాయం చేస్తున్నాయి. స్వామి కైంకర్యం నిమిత్తం సంబారములను భక్తులే స్వయంగా శిరంనందుంచుకొనని(ఇరుముడు Irumudi) యాత్ర చేయటం విధిగా నిర్ణయించారు.
18 మెట్లపై సాగి స్వామి దర్శనం చేయటానికి శబరిమల యాత్ర (Shabarimala Yatra) చేసే భక్తులు.. వీర, పద్మాశన, చిన్ముద్రమూర్తి అయిన శ్రీఅయ్యప్ప స్వామిని సేవించి, నిజ జీవితంలో అట్టి దీక్షను కొనసాగిస్తూ కడు ధన్యులవుతున్నారు. వారు స్వాముల వలె కడు పూజనీ యులవుతున్నారు. ఈ స్వామికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.
అయ్యప్ప భక్తులు పాటించాల్సిన నియమాల తోరణం
ఫ్యాషన్ కోసం కాకుండా భక్తితో దీక్ష స్వీకరించాలి
దీక్ష పూర్తయిన తర్వాత కూడా జీవితంలో.. మాటతో, ప్రవర్తనతో, ఆలోచనలతో, చూపుతో, తెలిసో తెలియకో ఎవరికీ హాని చేయరాదు. అనవసర మాటలకు, తగాదాలకు స్వస్తి పలకాలి. దీక్ష రోజుల్లో చన్నీటి స్నానాన్ని ఆచరించాలి. సూర్యాస్తమయానికి ముందే ఇంట్లో సన్నిధానంలో దీపం వెలిగించాలి. పూజాధికాలు పూర్తిచేసుకోవాలి. సాత్వికాహారం తీసుకోవాలి. నేలపైనే (చాప వేసుకోవచ్చు) పడు కోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అబద్ధాలాడరాదు. సౌందర్య సాధనాలు వాడరాదు (సబ్బు, షాంపు, తల నూనె వంటివి), క్షవరం చేయించకూడదు. గడ్డం, గోళ్లు తీయరాదు. మృతదేహాల్ని, జంతు కళేబరాలను చూసినప్పుడు స్నానం చేసి స్వామిని స్మరించుకొని గానీ మంచినీళ్లు తాగకూడదు. భిక్షకు ముందు విస్తరి ఎంత శుభ్రంగా ఉంటుందో తీసేటప్పుడూ అలాగే ఉండాలి.
మూడు, నాలుగేళ్లు మాల ధరిస్తే గురుస్వాములు(Guruswamulu) అవుతామనే భావన చాలా మందిలో ఉంటుంది. కనీసం ఎనిమిది సార్లు పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నవారు.. అందులోనూ తమ గురువు ఆజ్ఞతోనే గురుస్వాములు అవుతారు.
ఏ గుడి(Temple)లో అయితే మాలధారణ(Maaladharana) జరుగుతుందో.. దీక్షా కాలం పూర్తైన తర్వాత అదే గుడిలో మాల విసర్జన చేయాలి.
- కావ్య సుధ
