- తెలంగాణలో ఉపాధ్యాయ శిక్షణ ఫలితాలేమిటి?
- సమగ్ర శిక్ష నిధులు ఎంత ఖర్చయ్యాయి?
- నిష్ఠా–దీక్షా ద్వారా రాష్ట్రంలో బోధనా సామర్థ్యం ఎంత మెరుగుపడింది?
- 2020–21 నుంచి తెలంగాణకు సమగ్ర శిక్ష కింద ఎంత నిధులు విడుదలయ్యాయి?
- లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
- లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర విద్యా శాఖ మంత్రి
తెలంగాణలో ఉపాధ్యాయుల శిక్షణ(Telangana Teachers Training), డిజిటల్ బోధన ప్రభావం, అలాగే సమగ్ర శిక్ష అభియాన్ కింద రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఖమ్మం లోక్‌సభ సభ్యుడు (Khammam Lok sabha Mp) రామసహాయం రఘురాంరెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (Winter Session) రెండు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. దీనికి కేంద్ర విద్యా శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.
నిష్ఠా–దీక్షాతో ఉపాధ్యాయ శిక్షణ
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచేందుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్, టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్ (నిష్ఠ) జాతీయ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ శిక్షణను దీక్ష డిజిటల్ వేదిక ద్వారా 2020 అక్టోబర్ నుంచి అందిస్తున్నట్లు చెప్పారు. బోధనలో ఐసీటీ వినియోగం, విద్యార్థి కేంద్రిత పద్ధతులు, స్వీయ మూల్యాంకనం, పాఠ్య ప్రణాళికలు, ఇంటరాక్టివ్ కంటెంట్ వంటి అంశాలపై ఈ శిక్షణ దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 63 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిష్ఠా శిక్షణ పొందినట్లు వెల్లడించారు. ప్రాథమిక దశతోపాటు మాధ్యమిక స్థాయి ఉపాధ్యాయులకు కూడా ఈ శిక్షణను విస్తరించామని, ఫౌండేషనల్ లిటరసీ–న్యూమరసీ, ప్రీ–ప్రైమరీ (ECCE) రంగాలకు ప్రత్యేకంగా కార్యక్రమాలు అమలుచేస్తున్నామని తెలిపారు.
తెలంగాణకు సమగ్ర శిక్ష నిధులు
సమగ్ర శిక్ష అభియాన్ కింద 2020–21 నుంచి 2024–25 వరకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 2020–21లో కేంద్ర వాటా రూ.348.07 కోట్లు (మొత్తం వ్యయం రూ.1061.93 కోట్లు), 2024–25లో కేంద్ర వాటా రూ.988.79 కోట్లు(మొత్తం వ్యయం రూ.1691.41 కోట్లు)గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన మొత్తం నిధులు సుమారు రూ.3953 కోట్లు, రాష్ట్ర వాటాతో కలిపి రూ.7,100 కోట్లకు పైగా విద్యా రంగంలో ఖర్చు చేసినట్లు వివరించారు.
