ఈ నెల 18లోపు రండి.. తర్వాత వస్తే నో..
ఇతర పార్టీల సర్పంచ్‌లు అసూయపడేలా అభివృద్ధి చేస్తా
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
ఇతర రాజకీయ పార్టీల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు బీజేపీ(BJP)లోకి రావాలని కేంద్ర సహాయ మంత్రి (Union Minister of State) బండి సంజయ్ కోరారు. ఈ నెల 18లోపు వస్తే చేర్చుకుంటామని, ఆ తర్వాత వస్తామన్నా కుదరదని చెప్పారు. కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీల నుంచి గెలిచిన సర్పంచ్‌లు అసూయ పడేలా బీజేపీ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. తాజాగా గెలిచిన బీజేపీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లతో బండి సంజయ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
బీజేపీ సర్పంచ్‌లు ఉన్న గ్రామాల్లో జరిగే అభివృద్ధిని, నిధులను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో ఎందుకున్నామా? అని ఆయా పార్టీల సర్పంచ్‌లు అనుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు. ‘బీజేపీ అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టిపోటీనిచ్చి గెలిచిన సర్పంచులు నా దృష్టిలో హీరోలే(HEROs). తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసేందుకు పైసలు లేని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో సర్పంచ్‌లపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. అయినా బీజేపీ నుంచి గెలిచిన సర్పంచులకు అన్ని విధాలుగా అండగా ఉంటా.
ఎంపీ లాడ్స్(MP Lads), సీఎస్సార్ (CSR) ఫండ్స్‌తోపాటు కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆయా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు సైతం బీజేపీలోకి వస్తే ఆయా గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా. అయితే ఈ నెల 18లోపు బీజేపీలో చేరడానికి డెడ్ లైన్ విధిస్తున్నా. ఆ తర్వాత వచ్చినా ఎవరినీ చేర్చుకునే ప్రసక్తే లేదు. అధికార కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
అది తీవ్ర స్థాయికి చేరకముందే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కార్యకర్తలతోపాటు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా గ్రామాల్లో బీజేపీ గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అలాగే రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సర్పంచ్‌ల స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పని చేయాలి’ అని అన్నారు.
