ఉప్పల్ స్టేడియంలో ఆనంద క్షణాలు
ఆద్యంతం ప్రేక్షకులు, అభిమానుల కేరింతలు
మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్
అపర్ణ మెస్సీపై సింగరేణి టీమ్ విజయం
మనవణ్ని మెస్సీకి పరిచయం చేసిన సీఎం
మెస్సీని కలిసిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్
ఆకర్షణగా నిలిచిన అల్లు అయాన్, అర్హ
ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్(Foot Ball Exhibition Match) ఆద్యంతం అలరించింది. అపర్ణ మెస్సీ టీమ్(Aparna Messi Team)పై సీఎం రేవంత్ (CM Revanth) నేతృత్వంలోని సింగరేణి టీమ్ (Singareni Team) విజయం సాధించింది. మెస్సీ అపర్ణ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi).. విన్నర్, రన్నరప్ జట్లకు కప్‌లు అందించారు. గోట్ ఇండియా టూర్ 2025(G.O.A.T India Tour 2025)లో భాగంగా శనివారం మెస్సీ హైదరాబాద్‌కు వచ్చారు. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన భారీ బందోబస్తు మధ్య విమానాశ్రయం నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం చెప్పారు. తర్వాత ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మెస్సీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఈ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. మెస్సీ అపర్ణ, రేవంత్ సింగరేణి జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ను తిలకించారు. మ్యాచ్ 18వ నిమిషంలో గ్రౌండ్‌లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చీ రాగానే గోల్ కొట్టి అలరించారు.
మ్యాచ్ అనంతరం నిర్వహించిన పెనాల్టీ షూటౌట్‌లో కూడా గోల్ కొట్టారు. పెనాల్టీ షూటౌట్‌లో మెస్సీ రెండు గోల్స్ కొట్టి ఆకట్టుకున్నారు. మ్యాచ్ ముగిశాక గ్రౌండ్‌లోకి దిగిన మెస్సీ.. సీఎం రేవంత్‌తో పాటు ఆటగాళ్లతో సరదాగా కాసేపు ఆటాడారు. సీఎం రేవంత్ తన మనవణ్ని గ్రౌండ్‌లోకి తీసుకొచ్చి మెస్సీకి పరిచయం చేశారు. రేవంత్ మనవడితో మెస్సీ కాసేపు ఫుట్‌బాల్ ఆడారు. అనంతరం తన మనువడితో కలిసి సీఎం రేవంత్ మెస్సీతో ఫొటో దిగారు. మెస్సీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మ్యాచ్ అనంతరం అతనితో కలిసి ఫొటో దిగారు.
ఇక.. తన కోసం వచ్చిన ప్రేక్షకులకు మెస్సీ.. స్టేడియంలో చుట్టూ తిరుగుతూ అభివాదం చేశారు. దీంతో.. ఉప్పల్ స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మోరుమోగిపోయింది. మొత్తానికి మెస్సీ హైదరాబాద్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మెస్సీ మ్యాచ్ సందర్బంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారసులు (కుమారుడు) అల్లు అయాన్, (కుమార్తె) అల్లు అర్హ ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ స్నేహితులతో కలిసి వచ్చిన ఈ అన్నాచెల్లెళ్లు అక్కడి వాతావరణాన్ని ఉల్లాసంగా మార్చేశారు. కెమెరాల కంట పడినప్పుడు అయాన్.. అక్కడున్నవారందరికీ ఉత్సాహంగా హాయ్ చెప్పారు.
సరదాగా తన చెల్లి అర్హ మొహాన్ని కెమెరాకు కనిపించకుండా అయాన్ చెయ్యి అడ్డంపెట్టడం అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టేడియంలో ఉన్నవారితో ఈ అన్నాచెల్లెళ్లు కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ కార్యక్రమం సందర్భంగా జరిగిన గందరగోళ పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేవలం పాసులు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించారు. మ్యాచ్ దృష్ట్యా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మెస్సీ పర్యటన హైదరాబాద్‌లో క్రీడా , సామాజిక అంశాల్లో ఒక మరపురాని రోజుగా నిలిచిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
