ఏపీ ప్రభుత్వం ఈ నెల 16న కానిస్టేబుల్ (Constable) అభ్యర్థులకు నియామక పత్రాలను జారీ చేయనుంది. ఈ మేరకు శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లను హోం మంత్రి అనిత(Home Minister Anitha) పరిశీలించారు. మంగళగిరి(Mangalagiri)లోని APSP 6వ బెటాలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సభా వేదిక నిర్మాణం, వేదికకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు, వీవీఐపీ, వీఐపీలకు ఏర్పాటుచేసే వసతులు, జిల్లాల నుంచి హాజరయ్యే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, బందోబస్తుకు వచ్చే పోలీస్ అధికారులు, సిబ్బందికి కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర సమీక్ష (Review) నిర్వహించారు.
అనంతరం.. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లూ లేకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. తగినంత పోలీస్ బలగాలతో సమర్థవంతమైన బందోబస్తు ఏర్పాటుచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ సత్యయేసు బాబు, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్(ఎస్పీ) నగేష్, జిల్లా అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
