Thursday, February 12, 2026
Homeనల్లగొండRagging | అనాజ్ పురం మోడల్ స్కూల్లో ర్యాగింగ్ కలకలం.

Ragging | అనాజ్ పురం మోడల్ స్కూల్లో ర్యాగింగ్ కలకలం.

  • 10వ తరగతి విద్యార్థి ధనుష్‌కు విరిగిన భుజం ఎముక.
  • తల్లిదండ్రుల్లో ఆందోళన.

పెన్ పహాడ్ మండలం అనాజ్‌పురం మోడల్ స్కూల్‌లో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకొని 10వ తరగతి విద్యార్థి గాయాలు అయిన విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం స్కూల్ ముగిసే సమయంలో జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే మోడల్ స్కూల్ లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు గోవర్ధన్, మోహన్, రామ్ చరణ్ స్కూల్ నుండి బయటకు వచ్చే సమయంలో 10వ తరగతి విద్యార్థి సాగాల ధనుష్‌ పై కామెంట్లు చేయడంతో మాటామాటా గొడవకు దారితీసింది.

వెంటనే ఈ వాగ్వాదం ఘర్షణగా మారి ఇంటర్ విద్యార్థులు ధనుష్‌పై దాడి చేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనను ఆపేందుకు ప్రయత్నించిన ధనుష్ మిత్రులు కూడా గాయపడ్డారు. దాడి అనంతరం బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించగా, వారు స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడాలని సూచించారని తెలుస్తోంది. తరువాత దాడికి పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పడంతో మొదట్లో విషయం రాజీకి వచ్చినట్లు స్కూల్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

అయితే, ధనుష్ పరిస్థితి విషమిస్తున్నట్లు గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు భుజం ఎముక విరిగినట్లు నిర్ధారించారు. కనీసం నెలరోజులు పూర్తిగా విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవడంలో స్కూల్ వైఫల్యం ఉందని వారు ఆరోపిస్తున్నారు.

ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంపై స్కూలు ప్రిన్సిపాల్ కోడి లింగయ్యను వివరణ కోరగా.. స్కూల్ సమయం దాటాక స్కూల్ బయట విద్యార్థులు మాట మాట అనుకొని గొడవపడ్డారని తెలిపారు. ఈ గొడవలో ఎవరికి ఏం కాలేదని ఇరు విద్యార్థుల తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థికి గాయాలయ్యాయి అన్న విషయంపై ఏ విద్యార్థికి ఎలాంటి గాయాలు కాలేదని, ఆ విద్యార్థులు ఈ రోజు కూడా పాఠశాలకు వచ్చారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News