భాష, సాహిత్యం, జానపద కళలకు పునరుజ్జీవన కేంద్రం
1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషకు, సంస్కృతికి, వాఙ్మయానికి, జానపద సంపదకు, నాట్య, సంగీత, సంప్రదాయాలకు వేదికగా నిలిచే సమగ్ర విశ్వవిద్యాలయం అవసరమని తేల్చింది. ఫలితంగా అదే ఏడాది డిసెంబర్ 2న చట్టం నం.27 ద్వారా పొట్టి శ్రీరాములు(Potti Sriramulu) తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల జనప్రియుడైన పొట్టి శ్రీరాములు పేరుతో ఈ సంస్థ ఏర్పడటమే కాదు.. ఆయన త్యాగస్ఫూర్తిని విద్యా రూపంలో నిలబెట్టడమే ఈ మహా సంస్థ ప్రథమ ధ్యేయంగా మారింది.
ప్రారంభంలో హైదరాబాద్ నాంపల్లి(Nampally)లోని పాత భవనాల్లో పరిమిత వసతులతో మొదలైనప్పటికీ త్వరితగతిన పెద్ద భవనాలు, పరిశోధనా కేంద్రాలు, కళా విభాగాలు, గ్రంథాలయాలు, నృత్య, సంగీత శిక్షణా మందిరాలతో సమగ్ర విద్యా నగరంగా అభివృద్ధి చెందింది.
తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్భావానికి 1970, 80 దశకాల్లో జరిగిన భాషా ఉద్యమాలు, సాహిత్యవేత్తల ప్రతిపాదనలు, జానపద పరిశోధనా వర్గాల నిరంతర చర్చలు మౌలిక కేంద్రమయ్యాయి. ఒక ప్రాంతీయ భాషను కేంద్రంగా చేసుకొని భాష, సాహిత్యాల నుంచి నాట్యం, సంగీతం వరకు, జానపద, రంగస్థల కళల నుంచి పురావస్తు, పరిశోధనల వరకు అన్నింటినీ ఏకం చేసే విశ్వవిద్యాలయం దేశంలో లేనప్పుడు ఈ సంస్థ ఆ లోటును తీర్చింది.
1985–90 మధ్యలో జానపద శాస్త్రం, అపర వేదాలు, పురాణ సంప్రదాయాలు, అనువాద శాస్త్రం, భాషా విజ్ఞానం, తెలుగు విమర్శ, నాట్య శాస్త్రం వంటి శాఖలు విస్తరించగా 1990–2000లో తెలుగు విశ్వకోశం, నిఘంటు ప్రాజెక్టు(Dictionary Project), శాస్త్రీయ గ్రంథాల సంపాదన, వేద–ఆగమ–పురాణ పరిశోధనలు, గిరిజన జానపద పరిశోధనలు దేశవ్యాప్త గుర్తింపు పొందాయి. సుమారు 5 వేలకు పైగా జానపద గేయాలు, 800కు పైగా సామెతలు, 150కి పైగా గిరిజన కథనాలు, 200కు పైగా పురాణ ప్రతులను ఈ 2 దశాబ్దాల్లో డిజిటల్ రూపంలోకి మార్చారు.
కళా శాస్త్రాల విభాగంగా ఏర్పడిన నృత్య, సంగీత పీఠం ఈ విశ్వవిద్యాలయ విజ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం. కూచిపూడి నృత్య విభాగం ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందింది. భరతనాట్యం, పేరిణి శివ తాండవం, యక్షగానం, వీణ, మృదంగం, వయలిన్, బుర్రకథ, హరికథ వంటి శాస్త్రీయ, జానపద కళలకు ఉచిత, ప్రామాణిక, ప్రాచీన గురుకుల శైలిలో శిక్షణ ఇచ్చే ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇది మాత్రమే. 1998–2024లో ఒక్క కూచిపూడి విభాగం నుంచే 12 దేశాల్లో 400కు పైగా ప్రదర్శనలు జరిగాయి. యక్షగాన విభాగం 120 ప్రదర్శనలు, వయలిన్–వీణ విభాగాల్లో 600కు పైగా విద్యార్థులు కళాసేవలో ప్రవేశించారు.
((డిసెంబర్ 2న తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం(Foundation Day))
- రామకిష్టయ్య సంగనభట్ల
